Chittoor YCP: ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చుతున్న ఆ ముగ్గురు నేతలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీలో ముఖ్య నేతలుగా ఉన్నారు. ఒకరు సీనియర్ మంత్రి కాగా, మరొకరు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ఉన్నారు.

Written By: Dharma, Updated On : August 16, 2023 6:18 pm

Chittoor YCP

Follow us on

Chittoor YCP: ఆ జిల్లా వైసీపీలో ఆ ముగ్గురు నేతల ఆధిపత్యం ఎక్కువ అవుతోందా? హై కమాండ్ సైతం వారికే ప్రాధాన్యమిస్తోందా? మిగతా సామాజిక వర్గ నేతల్లో అసంతృప్తికి కారణం అవుతోందా? ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ ముగ్గురు నేతలు ఎవరు? తెలియాలంటే ఈ స్టోరీని చదవండి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీలో ముఖ్య నేతలుగా ఉన్నారు. ఒకరు సీనియర్ మంత్రి కాగా, మరొకరు టీటీడీ పాలక మండలి చైర్మన్ గా ఉన్నారు. అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం సీఎం జగన్ కోటరీలో చేరారు. దీంతో ఈ ముగ్గురు నేతలు వైసీపీలో కీలకంగా మారారు. వీరి ఆధిపత్యంతో జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారారని ఆరోపణలు ఉన్నాయి. చివరికి మంత్రి రోజా సైతం వీరి అడుగులకు మడుగులు వత్తాల్సిందేనని ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో ఏ పని కావాలన్నా ఆ ముగ్గురు రెడ్డి నాయకులకు అడగాల్సిందేనని టాక్ నడుస్తోంది. పుంగనూరు, పీలేరు, పలమనేరు వంటి నియోజకవర్గాలతో పాటు కుప్పంలో సైతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పుతున్నారు. చంద్రగిరి పక్క నియోజకవర్గాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా నడుస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిందే వేదంగా మారుతుంది.

వీరితో పాటు వారసులు సైతం పొలిటికల్ హవా నడిపిస్తున్నారు. జిల్లాలో మూడు వంతులకు పైగా నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తండ్రీ,కుమారులే వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కి టిటిడి పీఠం అప్పగించారు. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి తిరుపతి నియోజకవర్గ బాధ్యతలను కట్టబెట్టారు. పైగా ఆయన తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా కూడా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడి కి తుడా చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టారు. దీంతో అటు తండ్రులు, ఇటు కుమారులు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారు అన్న టాక్ ఉంది. ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చి ఆడుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందోనని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.