Congress: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ లపై సంతకాలు చేశారు. శనివారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. మొత్తం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన వివరించారు. విద్యుత్ 200 యూనిట్ల లోపు ఉచితంగా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఇందులో కొన్ని లోప భూయిష్టమైన విధానాలు కొనసాగించారని గుర్తించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై ఒక నిర్ణయానికి వచ్చారు అనుకుందాం. మరి మిగతా విషయాల సంగతి? ఆ నాలుగు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఒకవేళ అవి అమల్లోకి వస్తే ప్రజలపై ఎటువంటి భారం పడుతుందంటే..
సాధారణంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. ప్రస్తుతం ఇప్పటివరకు యాసంగి రైతుబంధు రైతుల ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. ఉద్యోగులకు వేతనాలు కూడా ఖాతాల్లో జమ కాలేదు. దీనికి కారణం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడమే. ఇక ఇప్పటికిప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన చెల్లింపులు చాలా ఉన్నాయి. అవే కాకుండా అమలు చేయాల్సిన కొత్త పథకాలు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నెత్తిమీద ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది.. తెలంగాణ ఏర్పడినాటికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ఉందంటే దానికి కారణం గత ప్రభుత్వ విధానాలే. పోనీ ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా రాబడులు పెంచుకునే మార్గం వైపు ఆలోచిస్తుందా అంటే.. దానికి సమాధానమే లభించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకమందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి అంటే సంవత్సరానికి 75 వేల కోట్లు అవసరం అవుతాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ స్వరూపం 2 లక్షల కోట్లు అనుకుంటే.. అందులో సింహభాగం డబ్బులు ఆరు గ్యారెంటీ లకే సరిపోతాయి. ఇంకా చెల్లించాల్సిన అప్పులు అలాగే మిగిలిపోతాయి. దీని వల్ల ప్రభుత్వం అభివృద్ధి మీద నగదు వెచ్చించే తీరు తగ్గిపోతుంది. అది అంతిమంగా పెట్టుబడుల మీద పడుతుంది. రాష్ట్రా నికి పెట్టుబడులు రాకపోతే అది అభివృద్ధి మీద పెను ప్రభావం చూపిస్తుంది. అభివృద్ధి ఆగిపోతే ఉద్యోగాలు తగ్గిపోతాయి. ప్రభుత్వానికి రాబడులు కూడా తగ్గిపోతాయి. వెరసి రాష్ట్ర ఆర్థిక చక్రం పూర్తిగా గతి తప్పుతుంది.
ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే దానికి కచ్చితంగా డబ్బులు కావాలి. సంక్షేమం మీద డబ్బులు ఖర్చు చేస్తున్నప్పుడు వాటిని భర్తీ చేసుకునేందుకు పన్నులు పెంచుతుంది. ప్రస్తుతం పన్నుల ఆదాయం మొత్తం జిఎస్టి కి బదిలీ అయింది. రాష్ట్రం వద్ద మాత్రం కొన్ని ఆదాయాలు వచ్చే మార్గాలు ఉన్నాయి. మద్యం, రిజిస్ట్రేషన్లు, విద్యుత్ చార్జీలు, ప్రాపర్టీ టాక్స్, వెహికల్ ఇన్సూరెన్స్ టాక్స్, సీనరేజి టాక్స్.. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ ధర అమాంతం పెంచారు. రిజిస్ట్రేషన్ల చార్జీలు కూడా పెంచారు. సినరేజీ టాక్స్ కూడా పెంచారు. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి వీటి చార్జీలు పెంచడం అనేది అనివార్యమవుతుంది. ఇక ధరలు పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సంక్షేమానికి అలవాటు పడితే.. పెరిగిన ధరలు కూడా చెల్లించడానికి సిద్ధపడాల్సి ఉంటుంది. అంతిమంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు వేటిని కూడా ఉచితంగా ఇవ్వవు. ఉచితంగా ఇచ్చాయి అంటే ఏదో ఒక రూపంలో వాటిని భర్తీ చేసుకుంటాయి. కానీ అంతిమంగా ఆ భారం భరించాల్సిందే ప్రజలే.
వామ్మో.. మనం ఇలా బుక్కయ్యామా?రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తో చాలా కష్టమే! pic.twitter.com/krsH0zD71v
— News Line Telugu (@NewsLineTelugu) December 7, 2023