ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారు. ఏపీలో సోమవారం నుంచి కర్ఫ్యూ సడలింపును ఇస్తూ మరింతగా ప్రజలకు వెసులుబాటును ఇచ్చారు. సడలింపు వేళల్లో మార్పులు చేశారు.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూని సడలించారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఏపీలో సడలింపులు ఉండేవి. ఇప్పుడు కరోనా నియంత్రణలోకి రావడంతో టైమింగ్ మార్చారు.
ఈ మారిన కొత్త సడలింపు నిబంధనలు ఈనెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో కరోనా కట్టడి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నిన్న దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించింది. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ప్రభుత్వం ఈ జిల్లాలో కర్ఫ్యూ వేళలను సడలించలేదు. ఆ జిల్లాలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపు ఉంటుంది. కర్ఫ్యూ వేళలో బయటకు అకారణంగా వస్తే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.