
అమెరికాలో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రెటీల సోషల్ మీడియాగా ఉన్న ట్విట్టర్ పప్పులు భారత్ లో ఉడకలేదు. భారత ప్రభుత్వ ఐటీ నిబంధనలు పాటించాలని నోటీసుల మీద నోటీసులు ఇచ్చినా కూడా ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరించిన ట్విట్టర్ కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది.
దేశంలోనే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. నూతన ఐటీ నిబంధనలు అమలు చేయనందుకు గాను ట్విట్టర్ తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. దీంతో యూజర్ల అభ్యంతరక పోస్టులకు ఇకపై ట్విటర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక పై ట్విట్టర్ లో అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన కేసుల్లో భారత చట్టాలకు అనుగుణంగా ట్విట్టర్ కూడా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని తెలిపాయి. అయితే మధ్యవర్తి హోదా రద్దుపై ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు.
కాగా కేంద్రం ఆగ్రహానికి గురై భారత్ లో ఈ హోదా కోల్పోయిన మొట్టమొదటి సోషల్ మీడియా సంస్థ ‘ట్విట్టర్’ కావడం విశేషం. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తరప్రదేశ్ లో ట్విట్టర్ పై కేసు కూడా నమోదైంది. జూన్ 5న ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ట్విట్టర్, కొందరు జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అభ్యంతరకర, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించనందుకు గాను ట్విట్టర్ పై ఈ కేసు నమోదైంది.
ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలను తక్షణమే అమలు చేయాలంటూ కేంద్రప్రభుత్వం ట్విట్టర్ కు కొన్నాళ్ల క్రితం తుది నోటీసులు జారీ చేసింది. వీటిని అమలును ఇప్పటికీ ట్విట్టర్ చేయడం లేదు. దీంతో కేంద్రం ట్విట్టర్ నిషేధం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల అమలుపై ట్విట్టర్ కు సమన్లు జారీ చేసింది కేంద్రం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తాజాగా షాక్ ఇచ్చింది. పార్లమెంట్ కాంప్లెక్స్ లో జూన్ 18వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే విచారణకు హాజరు కావాలని పేర్కొంది.