
Rushikonda: చేసేవి తప్పులు.. మళ్లీ అడ్డగోలు వాదనలు.. గత నాలుగేళ్ల వైసీపీ పాలనలో కనిపించినవి ఇవే. విశాఖకే తలమానికంగా నిలిచిన రుషికొండనే అడ్డంగా తొలిచేశారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టి పర్యాటక ఆనవాళ్లు లేకుండా చేశారు.పైగా పరదాలు కప్పి కవర్ చేశారు. అయినా అడ్డంగా బుక్కయ్యారు. విశాఖలోని రుషికొండపై నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగాయని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ (ఎంవోఈఎఫ్) కమిటీ నిర్ధారించింది. అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు జరిపి, నిర్మాణాలు జరుపుతున్నది వాస్తవమేనని హైకోర్టుకు నివేదిక సమర్పించింది. తమ శాఖ నుంచి పొందిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని స్పష్టం చేసింది.
కేసు నేపథ్యం ఇది..
కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌కు రుషికొండను తవ్వేయడంతో పాటు చెట్లను తొలగిస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన నాయకుడు పీవీఎన్‌ఎన్ మూర్తి యాదవ్ వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే వ్యాజ్యంలో తన వాదనలు కూడా వినాలని కోరుతూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవన్నీ ఇటీవల విచారణకు రాగా కొండపై నిర్మాణాల కోసం జరిపిన తవ్వకాలపై సర్వే నిర్వహించి, నివేదికను కోర్టు ముందుంచాలని కేంద్ర పర్యావరణ-అటవీ మంత్రిత్వశాఖ (ఎంవోఈఎ్‌ఫ)ను కోర్టు ఆదేశించింది. గత కొద్దిరోజులుగా అధ్యయనం చేసిన కమిటీ ఈ మేరకు కోర్టుకు నివేదిక సమర్పించింది. కాగా ఈ కేసు విచారణ ఈ నెల 26కు వాయిదా పడింది.
పచ్చటి పరదాలతో కవరింగ్..
విశాఖకు మణిదీపం రుషికొండ. బీచ్ ఒడ్డున ఉండే ఈ కొండ పర్యాటక ప్రాంతం. సాగరనగరానికి ఒక ల్యాండ్ మార్కు. పచ్చటి తివాచీ పరిచినట్టు ఉంటుంది. రిసార్ట్స్ తో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. విశాఖ వచ్చే పర్యాటకులు ఎక్కువ మంది రుషికొండను సందర్శిస్తే కానీ వెళ్లరు. అటువంటి రుషికొండను అడ్డగోలుగా తవ్వేశారు. ఆనవాళ్లు లేకుండా చేశారు. రిసార్ట్స్ ను కూలగొట్టి నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే అనుమతులకు మించి తవ్వకాలు చేపడుతున్నారని న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఐదుగురు పర్యావరణ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. కమిటీ పర్యటించే సమయంలో రుషికొండను పచ్చటి పరదాలతో కప్పేశారు. పైగా అడ్డగోలు వాదనను తెరపైకి తెచ్చి ప్రచారం చేశారు.

సీఎం క్యాంప్ ఆఫీసు కట్టేందుకు..
అయితే రుషికొండలో ఇంతటి విధ్వంసానికి జరగడానికి కారణం సీఎం జగన్. అక్కడ సీఎం క్యాంప్ ఆఫీసు కట్టాలని ముచ్చటపడ్డారు. అందుకే ఎడాపెడ కొండను తొలచి ఆనవాళ్లు లేకుండా సముద్రంలో పడేశారు.కానీ ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది యంత్రాంగమే. అక్కడ ఉల్లంఘనలు జరిగాయని కమిటీ నివేదిక ఇచ్చాక హై కోర్టు సీరియస్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే అధికారులను, ఉద్యోగులను బలిచేయడం జగన్ సర్కారుకు కొత్త కాదు. తప్పు పాలకులు చేసి ఆ భారం అధికారులపై మోపడం దారుణం. మరి కోర్టు ఎటువంటి తీర్పు వెల్లడిస్తుందో చూడాలి మరీ.