
Kiran Kumar Reddy- BJP: మాజీ సీఎం కిరణ్ బీజేపీలో చేర్చుకోవడం వెనుక భారీ వ్యూహం ఉందా? తాను ఏపీతో పాటు తెలంగాణకు చెందిన నాయకుడుగా ఎందుకు చెబుతున్నారు? ఎక్కడి నుంచైనా రాజకీయం చేయవచ్చని ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? దీని వెనుక అసలు కథ ఏమిటి? ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్. పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశమైంది. దీనిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీని వెనుక బీజేపీ భారీ కసరత్తు చేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లూ లోపాలతో సతమతమైన కాషాయదళం పక్కా వ్యూహాంతోముందుకు సాగకుంటే ఏపీలో కీలక భూమిక పోషించలేమని భావిస్తోంది. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఉంటే తిరుగులేని నాయకుడు…
కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కాకుంటే కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీలో తిరుగులేని నాయకుడు. వైఎస్ మరణంతో రోశయ్య.. అటు తరువాత కిరణ్ కుమార్ రెడ్డి అనూహ్యంగా సీఎం అయ్యారు. దాదాపు మూడున్నరేళ్లు రాష్ట్రాన్ని కిరణ్ పాలించారు. మంచి పాలనా దక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో హేమాహేమీలైన మంత్రులు కిరణ్ కేబినెట్ లో పనిచేశారు., వారందరితో కిరణ్ కు సన్నిహిత సంబంధాలుండేవి. వారంతా కిరణ్ కుమార్ నాయకత్వంపై సంతృప్తిగా ఉండేవారు. అటువంటి సమయంలో తెలంగాణ వాదం దెబ్బకొట్టింది. రాష్ట్రాన్ని విభజించి రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలహీనపడింది. అయితే పార్టీ లేనప్పుడు ఎంత మంచి నాయకుడు అయినా రాణించడం కష్టం. కిరణ్ కు అదే ఎదురైంది.
వారంతా టర్న్ అవుతారని..
అయితే కిరణ్ లోని నాయకత్వాన్ని గుర్తించిన బీజేపీ పార్టీలో చేర్చుకుంది. ఆయన నాయకత్వాన్ని బలపరచడం ద్వారా గతంలో అతడితో పనిచేసిన వారు టర్న్ అవుతారని భావిస్తోంది. పైగా కిరణ్ ఉమ్మడి ఏపీలో మూడున్నరేళ్ల పాటు ఏలారు. తెలంగణలో నవంబరులో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడకు 6 మాసాల తరవాత ఏపీలో జరుగుతాయి. రెండుచోట్ల మంచి ఫలితాలు దక్కాలంటే చరిష్మ ఉన్న నాయకుడు అవసరం. అందుకే కిరణ్ సేవలను వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ ఆలోచన చేసింది. పార్టీలో చేర్చుకుంది.
అవకాశాలు లేనివారిని ఆకర్షించడానికి..
కాంగ్రెస్ పార్టీలో కిరణ్ తో పనిచేసిన చాలామంది నాయకులు సరైన అవకాశాలు దక్కక సరైన టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వైసీపీ, టీడీపీలో బెర్తులు లేక కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. మరికొందరు ఆ రెండు పార్టీల్లో చేరినా అప్పటికే ఆలస్యమైంది. దీంతో అవకాశం దక్కకుండా పోయింది. అసంతృప్తిగానే ఆ రెండు పార్టీల్లో కొనసాగుతున్నవారు ఉన్నారు. వారందర్నీ కిరణ్ రూపంలో ఆకర్షించాలన్నది బీజేపీ ప్లాన్. అందుకే ఉన్నపలంగా కిరణ్ ను బీజేపీ లోకి హైకమాండ్ రప్పించుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ కిరణ్ సేవలను వినియోగించుకోవాలన్నది బీజేపీ వ్యూహం. అందుకే తాను రెండు ప్రాంతాలకు చెందినవాడినని కిరణ్ తో బీజేపీ చెప్పిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో చాలా వ్యూహంతోనే కిరణ్ ను బీజేపీలో చేర్చుకుందన్న మాట.