Kotia Conflict: కొఠియా..దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. ఆంధ్రా, ఒడిశాల మధ్య నలుగుతున్న ‘కొఠియా’ వివాదానిది సుదీర్ఘ చరిత్ర. 21 కొఠియా గ్రూపు గ్రామాలు మావంటే మావేనంటూ ఆంధ్రా, ఒడిశా కీచులాడుకుంటూ వస్తున్నాయి. బ్రిటీష్ పాలకుల నుంచి నేటివరకూ కొఠియా గ్రామాలు ఎవరివన్నదానిపై స్పష్టత లేదు. సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని న్యాయస్థానాలు సూచిస్తున్నా రెండు ప్రభుత్వాలూ బెట్టు వీడడం లేదు. అపార ఖనిజ సంపద, అటవీ ఉత్పత్తులు, సాగునీటి వనరులు ఉన్న కొఠియా గ్రామాలను విడిచిపెట్టేందుకు ఇష్టపడడం లేదు. అక్కడి ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మెజార్టీ ప్రజలు మాత్రం ఆంధ్రా వైపే మొగ్గుచూపుతున్నారు.ప్రకృతి రమణీయత, అపార ఖనిజ నిల్వలు సొంతం చేసుకున్న ప్రాంతం ‘కొఠియా’. చుట్టూ ఎత్తైన కొండలు, జలపాతాల నడుమ ఉండే 21 గ్రామాలను కొఠియాగా పిలుస్తుంటారు.

విజయనగరం జిల్లా సాలూరు మండలంలో అంతర్భాంగా ఉండే ఈ గ్రామాలపై పట్టు సాధించేందుకు దశాబ్దాలుగా ఒడిశా, ఆంధ్రా ప్రభుత్వాలు ఆరాటపడుతున్నాయి. బ్రిటీష్ పాలన నాటి నుంచే ఈ గ్రామాల సరిహద్దులు, భౌగోళిక విభజనపై ఎటువంటి స్పష్టత లేదు. బ్రిటీష్ కాలంలో కలకత్తా ప్రెసిడెన్సీలో ఒడిశాలోని గంజాం జిల్లాతో పాటు సాలూరు, శ్రీకాకుళం వంటి ప్రాంతాలు ఉండేవి. 1936లో ఒడిశా ఏర్పాటు చేసినప్పుడు మాత్రం అప్పటివరకూ గంజాం జిల్లాలో ఉండే సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ తదితర ప్రాంతాలను మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న విశాఖ జిల్లాలో కలిపారు. కానీ ఈ విలీన ప్రక్రియలో కొఠియా గ్రూప్‌లో ఉన్న 21 గ్రామాలపై అప్పట్లోనే స్పష్టత ఇవ్వలేదు. దీంతో కలకత్తా, మద్రాస్ ప్రెసిడెన్సీలు సైతం 21 గ్రామాలు తమవంటే తమవేనని వాదనకు దిగాయి.
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ సైలెంట్.. కారణం అదేనా?
స్వాతంత్ర వచ్చిన తరువాత కూడా..
స్వాతంత్రం ప్రకటన అనంతరం కూడా వివాదానికి తెరపడలేదు. తెరదించేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. మద్రాసు, ఒడిశా రాష్ట్రాలు కొఠియా గ్రూపు గ్రామాలు తమవంటే తమవేనని చూపించుకున్నాయి. 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో సైతం కొఠియా గ్రామాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. దీంతో వివాదం మరింత ముదిరింది. 1963లో ఒడిశా సుప్రీంకోర్టు తలుపుతట్టింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్టేటస్‌కో జారీ చేసింది. ఇరు రాష్ట్రాలూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. అప్పటి నుంచి ఉభయ రాష్ట్రాలు కొఠియా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం మాత్రం కొఠియాపై పట్టు పెంచుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. 2018 నుంచి ఇప్పటివరకూ రూ.150 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రా ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పెడచెవిన పెట్టింది. ఒడిశాకు పోటీగా ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుతో పాటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబరు 9న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ కొఠియా వివాదంపై చర్చలు జరిపారు. ఈ సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కమిటీ ఏర్పాటై వర్చువల్‌గా ఒకసారి సమావేశం జరిగింది.

అక్కడంతా విచిత్రం..
కొఠియా గ్రూపు గ్రామాల్లో ప్రజలు తెలుగు, ఒడియా భాషలు మాట్లాడుతుంటారు. ఇరు రాష్ట్రాల్లో ఓటుహక్కు, రేషన్ కార్డులు పొంది ఉన్నారు. ఇరు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు వేస్తుంటారు. కానీ ఇటీవల ఆంధ్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు చేస్తుండడంతో ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. కానీ ఆంద్రా ఎన్నికలను ఒడిశా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఒడిశాతో పోల్చితే ఆంధ్రా అధికారులు, ప్రజాప్రతినిధుల దూకుడు తక్కువ. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒడిశా పెద్ద దుమారమే రేపింది. ఓటు వేయకుండా అక్కడి స్థానికులను అడ్డగించింది. అక్కడి ప్రజాప్రతినిధులు, నాయకులు సైతం కొఠియా విషయంలో ఒకే తాటిపైకి వస్తారు. కానీ ఆంధ్రాలో మాత్రం ఆ పరిస్థితి లేదు.
Also Read:Analysis on Narayana Arrest : నారాయణ అరెస్ట్ పై ఎన్నో అనుమానాలు?