
G. V. L. Narasimha Rao: కాపులు కాపుకాసే వారే కానీ.. వారిని కాపుకాసే వారు మాత్రం లేకుండా పోతున్నారు. ఒకవేళ ఎవరైనా కాపుకాసేందుకు ముందుకొచ్చినా వారిని అబాసుపాలు చేయడం ఏపీలో కొత్తకాదు. కాపుల సంక్షేమం కోసం పాటుపడిన చాలా మంది నేతలను తెరమరుగు చేశారు. అదే కాపుల ఎదుట మరింత బలహీనం చేశారు. ఈ విషయంలో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పటికీ సక్సెస్ అవుతునే ఉన్నాయి. తాజాగా కాపుల కోసం గట్టిగానే వాయిస్ వినిపిస్తున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుపై ఎల్లో మీడియా పడింది. కాపుల కోసం ప్రశ్నించడానికి నువ్వెవరు? అన్న రేంజ్ లో జీవీఎల్ పై కథనాలు వండి వార్చుతోంది.
వంగవీటి మోహన్ రంగా తరువాత కాపు సామాజికవర్గం నుంచి ఆ స్థాయిలో బలమైన నాయకుడు దొరకలేదనే చెప్పవచ్చు. ఒక్క కాపుగానే కాకుండా అణగారిన వర్గాల గొంతుకై ఎదుగుతున్న క్రమంలో రంగా దారుణ హత్యకు గురయ్యారు. కానీ అటు తరువాత వచ్చిన నాయకులు తమ రాజకీయ ప్రాబల్యం కోసం మిగతా కుల రాజకీయ పార్టీల ఎదుట తలొగ్గక తప్పలేదు. అయితే చిరంజీవి రూపంలో కాపులకు ఒక అవకాశం వచ్చింది. కానీ అక్కడ కూడా కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు తమ మార్కు చూపాయి. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే వరకూ నిద్రపట్టకుండా వ్యవహరించాయి. ఒక ప్లాన్ ప్రకారం పీఆర్పీని కాంగ్రెస్ గూటికి చేర్చడంలో ఆ రెండు సామాజికవర్గాలు సక్సెస్ అయ్యాయి.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపులను టార్గెట్ చేసుకుంటూ ఎన్నో జిమ్మిక్కులు వెలుగుచూస్తుంటాయి. 2014లో చంద్రబాబు, 2019లో జగన్ కాపుల సపోర్టుతో అధికారంలోకి రాగలిగారు. కాపు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లతో సరిపెట్టుకున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి ఈబీసీ రిజర్వేషన్లు రద్దుచేసి సంక్షేమ ఫలాలను దక్కకుండా చేశారు. కనీసం ఒక జిల్లాకు ఆచార్య రంగా పేరు పెట్టాలని కోరినా పెడచెవినపెట్టారు. వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్వేచ్ఛనిచ్చినా కాపుల విషయంలో మాత్రం జగన్ ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు.

అయితే గత కొంతకాలంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కాపుల అజెండాను తీసుకొని… వారి సమస్యలను పార్లమెంట్ లోనూ.. బయటా మాట్లాడుతున్నారు. కాపుల రిజర్వేషన్ విషయమై రాజ్యసభలో లేవనెత్తిన సమస్యతోనే కేంద్రం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించుకోవచ్చని స్పష్టతనిచ్చింది. మోహన్ రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని కూడా జీవీఎల్ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల పేర్లు జిల్లాలకు పెట్టినప్పుడు , మోహన్ రంగా పేరు ఎందుకు పెట్టకూడదని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ఇప్పుడు జీవీఎల్ పై దుష్ప్రచారం ప్రారంభించారు. రాజకీయ అజెండాతో చేస్తున్నారని.. అసలు కాపుల గురించి అడగడానికి జీవీఎల్ ఎవరూ అని కొత్త పల్లవి అందుకున్నారు.అదీ కూడా కాపు నేతలతోనే కామెంట్స్ చేయిస్తున్నారు. కాపులకు అండగా నిలబడితే జరిగేది ఇదే కదా అన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి.
