
Mahashivratri 2023: శివుడి రూపం అపురూపం. శివుడు నిరాకారుడు. సాకారుడు కూడా. అదే ఆయన ప్రత్యేకత. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. శివుడి దేహం పై ఉన్న సర్పాలు భగవంతుడి జీవాత్మలు గాను, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనం అయిన పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతనూ సూచిస్తాయి. పట్టుకున్న 4 జింక కాళ్లు చతుర్వేదాలకు, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక.
శివుడు కేవలం రుద్రస్వరూపుడే కాదు ప్రేమ స్వరూపుడు కూడా. రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్ర గణపతి, పిశాచ గణాలుగా దర్శనమిస్తే శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతి దేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథ స్వామి, వేద వేదాంగ భూషణలు మనకు కనిపిస్తారు.

శివపార్వతులు తమ కళ్యాణ మహోత్సవానికి చక్కగా చిగురిచే పూచే వసంత కాలాన్ని మనకు ఇచ్చి ఆకులు రాలే శిశిరాన్ని ఎంచుకున్నారు ఆ దంపతులు. వెన్నెల మెండుగా కాసే పున్నమిని మనకు ఇచ్చి కన్ను పొడుచుకున్నా కానరాని బహుళ చతుర్దశిని తాము తీసుకున్నారు. త్రివేల అయితే అది మనకు ఇచ్చిందని భావించి తెల్లవారుజామున మంచిది అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. మల్లెల్ని మొల్లల్ని మనకు విడిచి, వాసన, రూప సౌందర్యం లేని తుమ్మి పువ్వులను సిద్ధం చేసుకున్నారు. చందనాన్ని మనపరం చేసి విభూదిని పులుముకున్నారు. ఊరేగింపునకు ఎద్దుని, అలంకారాలుగా పాములని ఇలా జగత్తు కోసం ఎన్ని త్యాగాలు చేసిన ఆ ఆదిదంపతుల కల్యాణ మహోత్సవాన్ని కనులారా గాంచాలి. పాపాలను తొలగించుకోవాలి.
