Amaravati Padayatra: అమరావతి టూ అరసవల్లి పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. నేడు రాజమండ్రిలో రైతుల పాదయత్ర జరగనుంది. నగరంలో 8 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేపట్టారు. అయితే పోటీగా వైసీపీ పాలనా వికేంద్రీకరణ సభను రాజమండ్రిలో నిర్వహిస్తోంది. కార్యక్రమం ప్రాంగణం మీదుగానే రైతుల పాదయాత్ర కొనసాగనుంది. దీంతో ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయోనని పోలీస్ శాఖ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే విశాఖలో జరిగిన పరిణామాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు బందబోస్తు నిర్వహించేందుకు పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి అదనపు బలగాలను తెప్పించుకోవాల్సి వస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే పోలీసులు ఇప్పుడు ఒకరకమైన ఒత్తిచడిని ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాను దాటింది. కొవ్వూరు మీదుగా రాజమండ్రి నగరంలో అడుగు పెట్టనుంది. ఇప్పటివరకూ ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు అన్న రేంజ్ లో పాదయాత్ర జరగనుంది. రాజమండ్రి నగరంలో ఎనిమిది కిలోమీటర్లు కొనసాగనున్న యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆజాద్ సర్కిల్ లో వైసీపీ పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా సభ ఏర్పాటు చేస్తుండడమే ఇందుకు కారణం. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం హాజరవుతున్నారు. అటు అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాల నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు. అటు వైసీపీ సభ, ఇటు రైతుల పాదయాత్ర, అటు ప్రముఖుల తాకిడి పోలీస్ శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే రాజమండ్రి నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు.

మొన్నటి విశాఖ ఎపిసోడ్ రేపిన వివాదం అంతా ఇంతా కాదు. వైసీపీ విశాఖ గర్జనకు పిలుపునివ్వగా.. అటు టీడీపీ సేవ్ విశాఖ పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. అటు జనసేన జనవాణి కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి రగడకు దారితీసింది. పోలీస్ శాఖ తీరుపై అన్ని రాజకీయ పక్షాలు విమర్శలు గుప్పించాయి. పవన్ ను హోటల్ కే పరిమితం చేయడం, విశాఖ నుంచి పంపించడం వంటి విషయంలో పోలీస్ శాఖ కార్నర్ అయ్యింది. ఇప్పుడు రాజమండ్రి వంతు వచ్చింది. ఇక్కడ ఎలా ముందుకెళ్లాలో తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అధికార పార్టీ ఆదేశాలు పాటించాలి. అదే సమయంలో విపక్షాలను సంయమనంతో సముదాయించాలి. ఒక విధంగా చెప్పాలంటే పోలీసులకు ఇది పరీక్షా సమయం. అమరావతి రైతులు అరసవల్లి చేరుకునే వరకూ భద్రత కల్పించడం పోలీసులకు కత్తిమీద సామే.