Homeజాతీయ వార్తలుMunugode By Election- TDP: మునుగోడు బరిలో టీడీపీ.. అభ్యర్థి అతనేనా?

Munugode By Election- TDP: మునుగోడు బరిలో టీడీపీ.. అభ్యర్థి అతనేనా?

Munugode By Election- TDP: తెలంగాణలో దాదాపు కనుమరుగైన టీడీపీ మళ్లీ యాక్టివ్‌ కావాలనుకుంటోంది. ఈమేరకు పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఉన్నంతకాలం తెలంగాణలో టీడీపీకి అవకాశం ఉండదని బాబు డిసైడ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీపై పెద్దగా ఫోకస్‌ కూడా పెట్టడం లేదు. కానీ టీఆర్‌ఎస్‌ కాస్త బీఆర్‌ఎస్‌గా మారడం.. గులాబీ బాస్‌ తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేయడంతో చంద్రబాబు మళ్లీ తెలంగాణపై ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలో కలిసి వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచి టీడీపీకి ఆదరణ తగ్గలేదని నిరూపించాలని చూస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడితోపాటు, కీలక నేతలతో చర్చించారు. ఈ క్రమంలో మునుగోడు బరిలో ఎవరిని నిలపాలన్న విషయమై కూడా మంతనాలు సాగించారు.

Munugode By Election- TDP
Munugode By Election- TDP

సైకిల్‌ రిపేర్‌పై దృష్టి..
రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు కేవలం ఏపీ రాజకీయాల మీదే పూర్తి ఫోకస్‌ పెట్టిన తెలుగుదేశం.. తెలంగాణలో అడపాదడపా మాత్రమే కనిపించింది. ప్రస్తుతం ఉనికి కోల్పోయే దశలో ఉన్న సైకిల్‌కు రిపేర్‌ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సైకిల్‌ను సిద్ధం చేయాలని చూస్తున్నారు. అందుకు మునుగోడు ఉప ఎన్నికనే వేదిక చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. బీఎస్పీ కూడా అభ్యర్థిని ప్రకటించింది. ఇటు.. టీజేఎస్‌ కూడా బరిలో ఉంటామని ప్రకటించింది. ఇక ఎర్రజెండా పార్టీలు కారుతో కలిశాయి. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ మాతమే. తెలంగాణలో జరిగిన అన్ని ఉపఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ.. ఇప్పుడు మునుగోడులో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

తెలంగాణలో ఎన్టీఆర్‌ భవన్‌కే పరిమితం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన తెలుగు దేశం పార్టీ.. విభజన తర్వాత కేవలం ఏపీ మీదే దృష్టి పెట్టింది. తెలంగాణలో మాత్రం ఎన్టీఆర్‌ భవన్‌కే పరిమితమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపైనే పూర్తి ఫోకస్‌ పెట్టడంతో తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఆ పార్టీలోని కీలక నేతలు తట్టాబుట్ట సర్ధుకుని తలోదారి వెతుక్కున్నారు. పార్టీలో కీలకంగా.. బాబుకు రైట్‌ హ్యాండ్‌గా వ్యవహరించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి చక్రం తిప్పుతున్నారు. మరోవైపు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ.. టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. మిగతా నేతల్లో చెప్పుకోదగ్గ వాళ్లంతా ఎక్కువ శాతం గులాబీ తీర్థం పుచ్చుకుంటే.. మిగతా వాళ్లంతా కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు. ప్రస్తుతం పార్టీ తన ఉనికి కోల్పోయే దశకు చేరింది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేయడంతో టీటీపీ అధినేత తెలంగాణపై కూడా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.

మునుగోడు బరిలో..
తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు.. మునుగోడు నుంచే పునాది వేయాలని చంద్రబాబు బావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే బాబు.. ఈ కొత్త ఎక్స్‌పరిమెంట్‌ ఏమేర ఫలితాలిస్తోందని తెలుగు తమ్ముళ్లు చర్చిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసే విషయంలో టీడీపీ తెలగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఎన్టీఆర్‌ భవన్‌లో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. టీఆర్‌ఎస్‌ కాస్త బీఆర్‌ఎస్‌గా మారిన ఈ సమయంలో పోటీ చేస్తే పార్టీకి ఎలాంటి ఉపయోగాలున్నాయో బాబుకు వివరించారు. బాబు పచ్చజెండా ఊపితే.. మునుగోడు బరిలో దిగేందుకు అన్ని రకాలుగా రెడీ అన్న విషయాన్ని.. స్పష్టంగా పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ మునుగోడు ఇన్‌చార్జి జక్కలి ఐలయ్య యాదవ్‌.. బాబుతో మాట్లాడారు.

Munugode By Election- TDP
Munugode

అభ్యర్థి అతనేనా…
మునుగోడు నియోజకవర్గంలో జక్కలి ఐలయ్యకు బీసీ నేతగా మంచి పేరు ఉంది. మరోవైపు నియోజకవర్గంలో బీసీవర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బీసీలలో తెలుగుదేశం మీద అభిమానం ఇంకా మిగిలే ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలోకి తీసుకున్న స్థానిక నేతలు.. మునుగోడులో పోటీ చేయాలని బాబును కోరుతున్నారు. దీంతో పార్టీ అస్థిత్వాన్ని కాపాడుకోవటమే కాకుండా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లోపాలను సరిదిద్ధుకుని మళ్లీ పుంజుకోవచ్చనే భావనలో ఉన్నారు. ఈ మధ్య చంద్రబాబు కూడా తెలంగాణపై దృష్టి పెడుతుండటం.. తెలుగు తమ్ముళ్లలో ఆశలు రేకెత్తుతున్నాయి. ఇటీవల బాబు భద్రాచలంలో పర్యటించటం కూడా ఇందుకు కారణం. త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లకు బాబు సూచించారు. ఈ నేపథ్యంలో.. మునుగోడు ఉపఎన్నికలో పోటీపై పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తిపై.. బాబు కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అభ్యర్థిగా జక్కలి ఐలయ్యను లేదా టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను టీడీపీ తరఫున బరిలో నిలిపాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

పట్టు లేకున్నా.. ప్రయోగం..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు వచ్చిన ఏ ఉపఎన్నికలోనూ టీడీపీ పోటీ చేయలేదు. కొన్ని చోట్ల పోటీ చేస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించినప్పటికీ.. ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో దూరంగానే ఉన్నారు. ఈసారి మాత్రం మునుగోడు ఉపఎన్నికను ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడులో ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా టీడీపీ కేవలం మూడు సార్లు మాత్రమే పోటీ చేయటం గమనార్హం. ఆ మూడు సార్లు కూడా ఓటమినే మూటగట్టుకుంది. ఇంకో ఎనిమిదిసార్లు ఎర్రజెండాతో పొత్తుపెట్టుకోవటంత్లో మునుగోడులో సైకిల్‌కు చాన్స్‌ రాలేదు. నియోజకవర్గంలో టీడీపీకి పట్టు లేకపోయినా ఈసారి మాత్రం.. తెలంగాణలో ఉనికి కాపాడుకునేందుకు మునుగోడు ఉపఎన్నికల వేదికగా చేస్తున్న ప్రయోగంలో.. బాబు ప్లాన్‌ ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular