
తెలంగాణలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతు బీమా, రైతుబంధు వంటి అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు. దురదృష్టవశాత్తు ఒకవేళ రైతు చనిపోతే రైతు బీమా అనేది అన్నదాత కుటుంబానికి అండగా నిలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ రైతుకు తెలంగాణ సర్కార్ రైతు బీమా కల్పించి ప్రభుత్వమే ప్రతీయేటా 500కోట్ల మేర చెల్లిస్తుంది. ఇక రైతుబంధు కింద రబీ, ఖరీఫ్ సీజన్లలో ప్రభుత్వమే ఎకరానికి 5వేల చొప్పున రైతుకు సాయమందిస్తోంది. తాజాగా రైతుబంధుపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రైతులు సర్కార్ సూచించిన పంటలు మాత్రమే పండించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వ ఆదేశాలను పాటించే రైతులకు మాత్రమే రైతుబంధు అందించాలని వ్యవసాయాధికారులకు ప్రభుత్వం సూచించినట్లు ప్రచారం జరుగుతుంది.
వ్యవసాయంలో నూతన మార్పులకు కేసీఆర్ శ్రీకారం..
తెలంగాణలో అత్యధిక వరి పంటను సాగు చేస్తున్నారు. నీళ్లు సరిగాలేని ప్రాంతాల్లో పత్తి పంటను చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేశారు. కోటి ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తికావడంతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు ఎత్తిపోతల ద్వారా కాళేశ్వరం నీటిని తరలిస్తున్నారు. దీంతో రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతోన్నాయి. నీరు పుష్కలంగా ఉండటంతో రైతన్నలంతా వరి పంట సాగుకే మొగ్గుచూపుతోంది. దీంతో ఈ ఏడాది దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పంటలపై దిశానిర్దేశం చేసేందుకు రెడీ అవుతోన్నారు.
రైతు పండించిన ప్రతీగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని ఐకేపీ సెంటర్లలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపడుతున్నాయి. కొన్నిచోట్ల తూకాల్లో మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నా మెజార్టీ ప్రాంతాల్లో కొనుగోళ్లు సజావుగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే రాష్ట్రమంతటా ఒకే పంట పండిస్తే గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ వర్షకాలంలో రైతులు వరితోపాటు 50లక్షల ఎకరాల్లో పత్తి, 10లక్షల ఎకరాల్లో కందులు, ఇతర పంటలు పండించేలా చర్యలు చేపడుతోంది. ఈమేరకు విత్తనాలను కూడా సిద్ధం చేసింది.
రైతులు ఇకపై ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తేనే రైతుబంధు పథకం వర్తించేలా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. ఇదిలా ఉండగా సర్కార్ చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు పంపిణీ చేయాలనే ఆదేశాలేమీ తమకు రాలేదని వ్యవసాయాధికారులు చెబుతుండటం గమనార్హం. దీనిపై ప్రభుత్వం రైతులకు మరింత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.