హుజూరాబాద్ ఎఫెక్ట్: మాక్కూడా ఉప ఎన్నిక వ‌స్తే బాగుండు!

‘‘రాజ‌కీయం అంటే ఒక‌ప్పుడు సేవ‌.. ఇప్పుడు పెట్టుబ‌డి లేని వ్యాపారం’’ ఇదీ.. స‌గ‌టు జ‌నాల్లో నాటుకుపోయిన అభిప్రాయం. వ్యాపారి ఏం చేస్తాడు? లాభం ఎలా రాబట్టుకోవాలా.. అని పథకాలు వేస్తాడు. ఇప్ప‌టి రాజకీయ నాయకులు సైతం ఇదే తీరుగా ‘ప‌థ‌కాలు’ రూపొందిస్తున్నార‌ని ప్రజలు చర్చించుకుంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ‘ద‌ళిత బంధు’ పథకంపై ఏ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోందో అంద‌రికీ తెలిసిందే. దాంతోపాటుగా ఇంకా ఎన్నో తాయిలాలు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌క‌టిస్తోంది రాష్ట్ర స‌ర్కారు. ‘దళిత […]

Written By: Bhaskar, Updated On : July 29, 2021 10:23 am
Follow us on

‘‘రాజ‌కీయం అంటే ఒక‌ప్పుడు సేవ‌.. ఇప్పుడు పెట్టుబ‌డి లేని వ్యాపారం’’ ఇదీ.. స‌గ‌టు జ‌నాల్లో నాటుకుపోయిన అభిప్రాయం. వ్యాపారి ఏం చేస్తాడు? లాభం ఎలా రాబట్టుకోవాలా.. అని పథకాలు వేస్తాడు. ఇప్ప‌టి రాజకీయ నాయకులు సైతం ఇదే తీరుగా ‘ప‌థ‌కాలు’ రూపొందిస్తున్నార‌ని ప్రజలు చర్చించుకుంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా ‘ద‌ళిత బంధు’ పథకంపై ఏ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోందో అంద‌రికీ తెలిసిందే. దాంతోపాటుగా ఇంకా ఎన్నో తాయిలాలు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌క‌టిస్తోంది రాష్ట్ర స‌ర్కారు.

‘దళిత బంధు’కు శ్రీకారం చుట్టిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. పైల‌ట్ ప్రాజెక్టు పేరుతో దీన్ని ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న హుజూరాబాద్ కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. ఈ ప‌థ‌కానికి భారీగా నిధులు కేటాయిస్తున్న‌ట్టు చెప్పారు. ఒక్కో ద‌ళిత‌ కుటుంబానికి ఏకంగా ప‌ది ల‌క్ష‌ల మేర‌ ల‌బ్ధి జ‌రిగేలా చూస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనిపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. హుజూరాబాద్ ఎన్నికల కోస‌మే ఈ ద‌ళిత‌బంధు ప‌థ‌కం ప్ర‌వేశ‌ పెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తాయి. అధికారికంగా ఓట్లు కొనుగోలు చేయ‌డానికి ఈ ప్లాన్ వేశార‌ని మండిప‌డ్డాయి.

ఈ విమ‌ర్శ‌ల‌ను రివ‌ర్సులో ముఖ్య‌మంత్రి ద‌బాయించ‌డం అంద‌రినీ నివ్వెర‌ప‌రిచింది. అవును.. ఎన్నిక‌ల కోస‌మే ఈ ప‌థ‌కం పెట్టామ‌ని ప్ర‌క‌టించేశారు. త‌మ‌దేమైనా స‌న్నాసుల మ‌ఠ‌మా? అని కూడా ప్ర‌శ్నించారు. త‌మ‌ది రాజ‌కీయ పార్టీ కాబ‌ట్టి.. రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని బాహాటంగా ప్ర‌క‌టించారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌జాస్వామ్య వాదుల‌ను విస్మ‌యానికి గురిచేశాయి. ప్ర‌జాధ‌నంతో ఒక పార్టీ ఓట్లు కొనుగోలు చేయ‌డ‌మేంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈ మేర‌కు ఫోర‌మ్ ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ సంస్థ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.

అయిన‌ప్ప‌టికీ.. అధికార పార్టీ త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళ్తోంది. హుజూరాబాద్ జ‌నాలు అడ‌గ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా అక్క‌డ ప‌లు వ‌రాలు ప్ర‌క‌టిస్తున్నారు. కొత్త రేష‌న్ కార్డులు, పెన్ష‌న్ల వంటివి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే ఇస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అదీ.. ఇదీ అని కాకుండా.. అన్ని అభివృద్ధి ప‌నులూ, లాభ‌దాయ‌క‌మైన ప‌థ‌కాలు హుజూరాబాద్ వెళ్తున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. దీంతో.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు కూడా ఉప ఎన్నిక కోరుకుంటున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. త‌మ ఎమ్మెల్యే రాజీనామా చేసో.. మ‌రో విధంగానో ఉప ఎన్నిక వ‌స్తే బాగుంటుంద‌ని జ‌నం ఆశ‌ప‌డుతున్నార‌ని రాజ‌కీయ నాయ‌కులు అంటున్నారు. మ‌రి, ఈ ట్రెండ్ భ‌విష్య‌త్ లో ఎలా మారుతుందో చూడాలి.