తెలంగాణలో అంతా సవ్యంగానే సాగుతోందని ఓ వైపు టీఆర్ఎస్ ప్రభుత్వాధినేతలు పేర్కొంటున్నారు. కానీ వారి చేత బాధింపబడే వారు మాత్రం రోడ్డెక్కుతున్నారు. న్యాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. చివరకు అంతా ప్రభుత్వం కనుసన్నల్లో కావడంతో తమ అన్యాయంపై ఎవరూ స్పందించకపోవడంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నారు. ఈ దారుణం తాజాగా చోటుచేసుకుంది. తెలంగాణలో సామాన్యులకు న్యాయం లేదా? అని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.
ఓ తెలంగాణ మంత్రి వల్ల తమకు ప్రాణహాని ఉందని.. రక్షించాలని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విశ్వనాథరావు-పుష్పలత దంపతులు హెచ్.ఆర్.సీని ఆశ్రయించారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామని.. ఓ కేసులో మంత్రికి వ్యతిరేకంగా నడుచుకున్నామని.. అప్పటి నుంచి తమకు వేధింపులు ప్రారంభమయ్యాయని వారు వాపోయారు.
మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామనే కక్షతో తమపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న తమను ఉద్యోగం నుంచి తీసివేయించారని విలపించారు. తమ బతుకులు తాము ఎలాగోలా బతుకుతున్నామని.. ఇకనైనా వేధింపులు ఆపాలని కోరారు. వారి నుంచి ప్రాణహాని ఉందని రక్షించాలని వేడుకున్నారు. సీఐతో అర్థరాత్రివేళ ఇంటిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ ఇంటిల్లిపాదిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వేధింపులు ఆపకపోతే మంత్రి, ఆయన సోదరుడి పేర్లతో లేఖరాసి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని ఎస్.హెచ్.ఆర్.సీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి లేఖపై కమిషన్ స్పందించాల్సి ఉంది.
ఇక వీరు అనంతరం న్యాయం జరిగేలా సాయం చేయాలని ప్రముఖ సోషల్ మీడియా ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్నను కలిశారు. అక్కడికి కొందరు మఫ్టీలో వచ్చి వారి ఫోన్ లాక్కొని వారిని తీసుకుపోయేందుకు ప్రయత్నించగా తీన్మార్ మల్లన్న టీం అడ్డుకొని నిలదీసింది. వాళ్లు పోలీసులా? ఎవరా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చర్యతో బాధిత దంపతులు రోడ్డుమీదకు వెళుతూ ఆత్మహత్యాయత్నం చేశారు. దీన్ని తీన్మార్ మల్లన్నం టీం అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
తమను వేధిస్తున్నారని.. బాధితులు బోరున ఏడ్చిన వైనం స్థానికులను కలిచివేసింది. తెలంగాణలో ఏంటీ దారుణం? ఏంటీ దౌర్జన్యం.. ప్రశ్నిస్తే ఇలా వేధిస్తారా? అని స్థానికులు నిలదీశారు.