
తెలంగాణ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే పోలింగ్ ప్రారంభం కాగా.. తొలి గంటలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. క్రమంగా ఓటర్ల తాకిడి పెరుగుతోంది. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తొలి మూడు గంటల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు. పోల్ అయ్యే ఓట్ల శాతం ఎలా ఉండొచ్చనేది తొలి మూడు గంటల్లో తేలిపోతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో పోలింగ్ పర్సంటేజీ తక్కువగా నమోదయ్యే అవకాశం లేదనే చెబుతున్నారు.
Also Read: భవిష్యత్తులో పవన్–-షర్మిల మధ్యే పోటీ..?
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మినిస్టర్ కేటీఆర్ తొలి గంటలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆయన ఓటు వేశారు. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందే బూత్ వద్దకు చేరుకోగా.. అక్కడే కొద్దిసేపు వేచి చూశారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే వరుసలో తన కంటే ముందున్న వారికి అవకాశం ఇచ్చారు. అనంతరం తాను ఓటు వేశారు.
Also Read: బండి సంజయ్ @ 600 కోట్ల కథ
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలనేవి అతిపెద్ద పండుగగా భావిస్తారని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని విజ్ఙప్తి చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే అభ్యర్థికే తాను ఓటు వేశానని అన్నారు. పోలింగ్ కేంద్రానికి బయలుదేరి రావడానికి ముందు గ్యాస్ సిలిండర్‌కు నమస్కారం పెట్టొచ్చానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందరికీ మంచి చేయగల అభ్యర్థికి ఓటు వేశానని చెప్పారు. గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 39 శాతం మాత్రమే పోలింగ్ నమోదైందని, ఈ సారి దాన్ని బ్రేక్ చేయాలని అన్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
హైదరాబాద్-–రంగారెడ్డి–మహబూబ్ నగర్, ఖమ్మం–-వరంగల్–-నల్లగొండ పట్టభద్ర నియోజకవర్గాలకు నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు.. టీఆర్ఎస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికను బీజేపీ వశం కావడం.. తదనంతరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్యంగా గట్టిపోటీని ఎదుర్కొనడం వంటి పరిణామాల మధ్య ఈ రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి తీరాల్సిన తప్పని పరిస్థితి టీఆర్‌ఎస్‌కు ఏర్పడింది. వరుసగా ఎదుర్కొన్న రెండు ఎన్నికల్లో చేదు అనుభవాలను చవి చూసిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాగా.. ఈ పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కలిపి మధ్యాహ్నం 12 గంటల వరకు 29 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఓటర్లైతే బారులు తీరి కనిపిస్తున్నారు.