Srisailam water : తెలంగాణ నీటిని తరలిస్తున్నా.. చేష్టలుడిగి చూస్తున్న జగన్

ప్రస్తుతానికి వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండింది కాబట్టి సరిపోయింది.. లేకుంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ సర్కార్ మాత్రం.. తమకు రాజకీయ ప్రయోజనాలే మిన్న అన్నట్టు ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది.

Written By: NARESH, Updated On : August 20, 2023 2:31 pm
Follow us on

Srisailam water : తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఒకరినొకరు సహకరించే ధోరణితో ఉంటారు. రెండు ప్రభుత్వాల మధ్య సహృద్భావ వాతావరణం ఉంటుంది. అయితే అది ఉభయ రాష్ట్రాల ప్రజల గురించి మాత్రం కాదు. అదే నిజమైతే విభజన సమస్యలకు ఏనాడో పరిష్కార మార్గాలు దొరికేవి. ఇప్పటికీ విభజన సమస్యలు అలానే ఉన్నాయి. కానీ వాటికి ఇద్దరు సీఎంలు మోక్షం కలిగించరు. రాజకీయంగా మాత్రం సహకరించుకుంటారు. రాష్ట్రాల విషయంలోకి వచ్చేసరికి మాత్రం కలహించుకునేలా నటిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడాపెడా నీళ్లను తెలంగాణ తరలించకపోతున్నా జగన్ సర్కార్ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది.

వాస్తవానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ సర్కార్ కు జగన్ ప్రభుత్వం ఇతోధికంగా సాయపడుతోందన్న టాక్ నడుస్తోంది. కనీసనీటిమట్టం ఉంచకుండా శ్రీశైలం నుంచి తెలంగాణ నీటిని తరలిస్తోంది. కాలేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంత కరెంటు ఉత్పత్తి అయినా కాలేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సరిపోదు. దీంతో శ్రీశైలం నుంచి నీటిని తరలించి.. తెలంగాణ విద్యుత్ ను తయారు చేసుకుంటుంది. జగన్ సర్కార్ మాత్రంకేంద్రానికి ఒక లేఖ రాసి.. మమ అనిపించేసింది.

తెలంగాణ సర్కార్ తీరును తప్పు పడుతున్న ఏపీ ప్రభుత్వం దీనిపై కఠినంగా వ్యవహరించలేకపోతోంది. ఇందుకు రాజకీయ స్నేహమే కారణం. ప్రభుత్వాలపరంగా కొట్లాడుకుంటున్నా.. తెరవెనుక మాత్రం కెసిఆర్ కు జగన్ సహకారం అందిస్తున్నారు. దీనికి ఏపీ మూల్యం చెల్లించుకుంటోంది. అటు కేంద్రం సైతం ఏపీ ప్రభుత్వ ఉదాసీన వైఖరితో వెనక్కి తగ్గుతోంది. వారికి లేని ఆత్రం తనకెందుకులే అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండింది కాబట్టి సరిపోయింది.. లేకుంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ సర్కార్ మాత్రం.. తమకు రాజకీయ ప్రయోజనాలే మిన్న అన్నట్టు ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది.