AP roads : నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు.. అన్నట్టుంది ఏపీలో అధికార వైసీపీ వ్యవహార శైలి. సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం కదా గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గమనించినట్టుంది. వారిని కూల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. వారిని భ్రమల్లో ముంచెత్తనుంది. ఏకంగా 313 కోట్లతో రహదారి నిర్మాణ పనులను చేయనున్నట్లు ప్రకటించింది. ఇన్నాళ్లకు.. అదీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. వర్షాకాలంలో రోడ్ల నిర్మాణానికి జీవోలు ఇస్తుండడం హాస్యాస్పదంగా మారింది.
ఏపీలో ఏ రహదారి చూసినా గోతులమయమే. ఆ గోతుల్లోనే రహదారిని వెతుక్కోవలసిన దౌర్భాగ్య స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారు. అయినా సరే ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా ఎటువంటి చలనం లేదు. ఎండాకాలంలో గడువులు ఇవ్వడం.. వర్షాకాలంలో వచ్చేటప్పటికి చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపించే సరికి ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో.. జగన్ సర్కార్ జీవోలతో హడావిడి చేస్తుంది. ఎన్నికల రోడ్లతో జిమ్మిక్కులు చేసే ప్రయత్నం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే శంకుస్థాపనలకు న్యాయమంటారు.. ఎన్నికల ముంగిట శంకుస్థాపనలు చేసే వాటికి మోసం అంటారని జగన్ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట ఇచ్చిన జీవోలు న్యాయమా? మోసమా?అన్నది జగన్ కే ఎరుక.
అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా రోడ్లపై పట్టెడు మట్టి కూడా వేయలేదు. అటువంటిది ఉన్నపలంగా ప్రభుత్వానికి రోడ్లు గుర్తుకొచ్చాయి. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు 313 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎస్టిమేట్లు, టెండర్ల ప్రక్రియ పూర్తయ్యలోపే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు రోడ్లపై ఎనలేని ప్రేమ చూపించడానికి ఎన్నికలే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రోడ్లను పట్టించుకోలేదు. టిడిపి హయాంలో మంజూరైన రోడ్ల పనులను సైతం రద్దు చేశారు. ఇప్పుడు నాలుగేళ్ల పాలన ముగిసిన తర్వాత రోడ్లను గుర్తు చేస్తూ.. సరికొత్త డ్రామాకు తెర లేపారు.