తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్న పురస్కరించుకొని అమరవీరులకు నివాళులర్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి గన్ పార్కుకు బయలుదేరారు. కేసీఆర్ కారులో బయలుదేరుతున్న క్రమంలో ఓ యువకుడు కాన్వాయ్ వైపు దూసుకెళ్లాడు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ కాన్వాయ్ అక్కడి నుంచి గన్ పార్కుకు బయలుదేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. రెండు నిమిషాల మౌనం పాటించారు.
నల్గొండ జిల్లా మల్లేపల్లికి చెందిన హన్మంతు నాయక్ కేసీఆర్ కాన్వాయ్ వైపు దూసుకెళ్లాడు. భద్రత బలగాల కళ్లుగప్పి కేసీఆర్ కారు డోర్ దగ్గరకు దూసుకెళ్లాడు. ఆ వెంటనే తేరుకున్న పోలీసులు హన్మంతును అదుపులోకి తీసుకుని విచారించారు. కేసీఆర్ ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇల్లు కోసం అతడు సీఎం కాన్వాయ్‌కు అడ్డుతగిలినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీఎం భద్రతపై పలు సందేహాలు రేకెత్తుతున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం నిరాడంబరంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.