Telangana Elections: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన క్రమంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో బంగారు నగలు, వెండి ఆభరణాలు కూడా లభ్యమవుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారీగా నగదు, బంగారం, వెండి లభ్యమవుతూనే ఉన్నాయి. పోలీసులు చెక్ పోస్ట్ లు ఏర్పాటుచేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ డబ్బు అక్రమ రవాణా ఆగడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో భారీగా నగదు పట్టుబడుతుండడం పోలీసులను కూడా ఆశ్చర్యపరుస్తున్నది. మియా పూర్ ప్రాంతంలో సోమవారం ఒక్కరోజే కోట్ల విలువైన బంగారం, వెండి, లక్షల విలువైన నగదు లభ్యమవడం విశేషం. అయితే తాజాగా నల్లగొండ జిల్లాలో ఒక్క కారులో తరలిస్తున్న 3.04 కోట్ల నగదు పట్టుబడటం పోలీసులను నివ్వెరపరిచింది. అయితే ఈ నగదుకు సంబంధించిన వివరాలు, వాటిని తరలిస్తున్న వ్యక్తుల నేపథ్యం గుజరాత్ రాష్ట్రం కావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
నల్లగొండ జిల్లాలో ఆదివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో టోల్ గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వాహనం అతివేగంగా మిర్యాలగూడ వైపు దూసుకెళ్లింది. అయితే ఆ కారును నిలువరించేందుకు పోలీసులు ఈదలగూడ జంక్షన్ వద్ద ప్రయత్నించారు. అయితే వారు చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. వాడపల్లి అంతర్రాష్ట్ర సమీకృత తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు ఆ కారును పట్టుకున్నారు. అందులో తనిఖీలు నిర్వహించగా.. కారు ముందు భాగంలో సీటు కింద గుట్టుగా దాచిన 3.4 కోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ స్వాధీనం చేసుకున్న నగదు గుజరాత్ రాష్ట్రానికి చెందిన విపుల్ కుమార్, అమర్ సిన్హాజా కు చెందినదని పోలీసులు గుర్తించారు. ఆ కారులో వారు ప్రయాణిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ నగదు గుజరాత్ రాష్ట్రం నుంచి రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి రావడంతో ఈ నగదు ఆ ప్రధాన పార్టీకి చెందినదిగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తులు కూడా ఓ పార్టీలో క్రియాశీలకంగా కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అయితే వారు ఈ నగదును ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరికి అందజేసేందుకు వారు వెళ్తున్నారు? వారి ఫోన్ రికార్డులు, వాట్సాప్ చాట్ ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. చాట్ హిస్టరీని రిట్రైవ్ చేసేందుకు ఫోరెన్సిక్ అధికారులకు పంపారు. ఐటీ అధికారులకు నగదు అందజేసిన పోలీసులు.. నిందితుల నుంచి ఇప్పటికే వాంగ్మూలాలు సేకరించారు. అయితే ఈ నగదు వ్యవహారంలో పెద్ద పెద్ద వ్యక్తులే ఉన్నారని తెలుస్తోంది.