Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దుమ్ము రేపుతున్న గులాబీ బాస్.. మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాని నిర్ణయించుకున్నారు. ప్రజా ఆశీర్వాత సభల పేరిట మొదటి విడత ఏడు సభలు.. రెండో విడత నిర్విరామంగా 36 సభలు నిర్వహించిన సీఎం కేసీఆర్.. మూడు రోజులు విరామం ఇవ్వనున్నారు. దీపావళి పండుగ కూడా ఉన్న నేపథ్యంలో ప్రచారానికి బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అదే సమయంలో ఈ మూడు రోజులు బావా బామ్మర్దులు.. కేటీఆర్, హరీశ్‌రావు ప్రచార జోరు పెంచనున్నారు. ఇదే సమయంలో మూడో విడత ప్రచారానికి ప్రణాళిక రూపొందించనున్నారు.
చప్పగానే రెండు విడతలు..
కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు రెండు విడతల్లో చప్పగానే సాగాయన్న అభిప్రాయం ప్రజల్లో, ఇటు సొంత పార్టీలోనూ వ్యక్తమవుతోంది. కొత్తదనం లేని ప్రసంగం.. మూస పద్దతిలో ప్రచారం.. చెప్పించే చెప్పడం.. కొత్తగా చేసే పనుల గురించి చెప్పకపోవడంతో సొంత పార్టీలోనే కేసీఆర్ ప్రచారంపై గులాబీ భవన్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మూడో విడత మామూలుగా ఉండకూడదన్న ఆలోచనలో కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారు. ఈమేకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే కొడంగల్, కరీనంగర్, కోరుట్ల, కోదాడ, పాలేరుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇపపటి వరకు జరిగిన ప్రచార సరళిపై ఫీడ్ బ్యాక్ తీసుకుని.. కొత్త వ్యూహం రూపొందిస్తున్నారని తెలిసింది.
కేటీఆర్, హరీశ్ రావుతో కలిసి..
గత నెల 15న హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్.. ఈనెల 9 వరకు 43 సభల్లో పాల్గొన్నారు. అయితే 10, 11, 12న మూడ్రోజులపాటు సభలకు కేసీఆర్ విరామం ఇచ్చారు. ఈనెల 12న దీపావళి సైతం ఉండటంతో సభ నిర్వహించడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి 13 నుంచి 28 వరకు 54 సభలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మూడ్రోజుల విరామంలో కేసీఆర్ ఇప్పటివరకు సాగిన ప్రచార సరళి, సభలు, నామినేషన్ల ప్రక్రియపై సమీక్షించనున్నట్లు సమాచారం.
నియోజకవర్గాల వారీగా వ్యూహాలు..
కేటీఆర్, హరీశ్‌రావుతో నియోజకవర్గాల వారీగా రివ్యూలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. సభలతో ఏ మేరకు ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై ఆధరణ పెరిగిందని, మేనిఫెస్టోను ఏ మేరకు ప్రచారం చేశారని, ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది.. ఇంకా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలనే అంశాలపై క్షుణ్నంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్, సర్వే సంస్థల రిపోర్టులు, వార్ రూంల నుంచి వచ్చిన సమాచారంపైనా సమీక్షించనున్నారు. ఎన్నికల వరకు నేతలు అవలంభించిన తీరుపై ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆశించిన మేర ప్రజల్లో ఆదరణ రాని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించి రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
బలమైన విపక్ష నేతలపై నజర్..
మరోవైపు విపక్షాల కట్టడికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలోని కీలక నేతలపై ఇప్పటికే నజర్ పెట్టారు. ఈ ఎన్నికల్లో ఓడించి వారి మనస్థైర్యం దెబ్బతీయాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ వారికి ప్రజల్లో ఆదరణ రాకుండా చూడాలని కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్‌లో కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి, నల్లగొండ–కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు–రాజగోపాల్ రెడ్డి, హుజూర్ ] గర్–ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధిర–భట్టి విక్రమార్క, పాలేరు–పొంగులేటి శ్రీనివాసరెడ్డిపైనా ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ నుంచి కరీంనగర్‌లో బండి సంజయ్, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ పోటీ చేస్తుండటంతో స్పెషల్ ఫోకస్ పెట్టిన కేసీఆర్ వారి కట్టడికి వ్యూహాలు రచిస్తున్నారు.
మొత్తంగా మూడో విడత ప్రచారంలో సభలతోపాటు రోడ్‌షోలకు గులాబీ భవన్‌లో ప్రణాళిక సిద్ధం అవుతుందని తెలుస్తోంది. ఈసారి సభలు మరింద అదిరిపోవాలి అన్నట్లుగా వ్యూహ రచన చేస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. మరి మూడో విడత ప్రచార శైలి మారుతుందా.. అదే మూస పద్దతిలో కొనసాగిస్తారా చూడాలి.