Pawan Kalyan Alliance With TDP and BJP: 2014, 2019 లో తగ్గాం. 2024లో తగ్గేదేలే.. అంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అన్నిసార్లు తగ్గాం.. ఈసారి మీరు తగ్గండంటూ అటు బీజేపీకి, ఇటు టీడీపీకి సంకేతాలిచ్చారు. అందరం కలిసి నిర్ణయించుకుందామని కూడా పిలుపునిచ్చారు. అసలు మనలో ఎంత ఐక్యత ఉందో చర్చించుకుందామన్నారు. తద్వారా అధికార పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అడ్వాంటేజ్ ఇవ్వకూడదని పవన్ భావిస్తున్నారు. తగ్గకుంటే మొదటికే మోసం వస్తుందని ఆయన తాను నడవాలని నిర్ణయించుకుంటున్న తెలుగుదేశం నాయకులకు బలమైన హెచ్చరికలు లు సైతం పంపారు. 2014లో తాను తగ్గి… రాష్ట్రాన్ని గెలిపించా నని.. అలాగే తనను తాను తగ్గించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని బైబిల్ సూక్తి నమ్ముతాను అని ఆధ్యాత్మిక సూక్తిని జోడించారు. తాను అసలు సీఎం అభ్యర్థిని అని ఎవరూ చెప్పలేదని..అంత ఆశ తనకు లేదని చెప్పడం ద్వారా ట్రాప్ రాజకీయాలకు పడబోనని తేల్చిచెప్పారు. తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఎవరో భావించి ఉండవచ్చని చెప్పడం ద్వారా వాస్తవికతను బయటపెట్టారు.
పవన్ తాజా వ్యాఖ్యలతో పొత్తులపై చర్చలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు ఇటు తెలుగు దేశం అధినేత చంద్రబాబు.. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై ఒకే అభిప్రాయంతో ఉండేవారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే త్యాగాలు తప్పవు అంటూ చెబుతూ వచ్చారు.. ఇద్దరు అదే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఆ రెండు పార్టీలు పొత్తులు ఫిక్స్ అయ్యాయి అంటూ ప్రచారం జరిగింది. అయితే మహానాడు తరువాత తెలుగు దేశం పార్టీ స్టాండ్ మార్చినట్టు కనిపించింది. అప్పటి వరకు వన్ సైడ్ లవ్ అంటూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు. పొత్తుల సంగతి తరువాత చూద్దాం అంటూ.. ముందే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఇకపై తాను తగ్గేదే లే అన్నారు. ఇప్పటికే మూడు సార్లు తగ్గానని.. మళ్లీ తననే తగ్గమనడం కరెక్టు కాదని.. ఈ విషయంలో తెలుగుదేశం నేతలే పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రస్తుతం అందరూ తనను పొత్తుల పై అడుగు తున్నారని.. ఒకప్పుడు వార్ వన్ సైడ్ అయ్యింది.. ఇప్పుడు వన్ సైడ్ లవ్ అయ్యింది అంటూ సెటైర్ వేశారు.
Also Read: Telangana Congress: కాంగ్రెస్ పుంజుకుంటోందా?.. గెలుపుపై పెరుగుతున్న ఆశలు!!
జనసేన, బిజెపి మధ్య బందం గట్టిగా ఉంది అన్నారు. అయితే కరోనా కారణంగా తమ మధ్య సోషల్ డిస్టెన్స్ వచ్చిందన్నారు. ఇటీవల తనకు ఏపీ నేతలతో సంబంధం లేదని.. జాతీయ బీజేపీ నేతలతోనే బంధం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా నడ్డా ఏపీకి వస్తున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. తనకు ముందుగా ఉన్న కార్యక్రమాల కారణంగా ఆయన్ను కలువలేకపోతున్నాను అన్నారు. బీజేపీ జాతీయ నాయకులతో కూడా మాట్లాడాను అన్నారు. రైతుల సమస్యలు, రాష్ట్రంలో పరిస్థితులు కూడా వివరించాను అన్నారు.
పనిలో పనిగా పవన్ ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శల జడివాన కురిపించారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు’ అనే బైబిల్ సూక్తిని తాను నమ్ముతానని… సీఎం జగన్ మాత్రం అందరినీ తగ్గించి తాను మాత్రం ఎదుగుతారని అన్నారు. ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బతీసి.. తాను ఇచ్చే పథకాలపై ఆధారపడేలా చేస్తున్నారన్నారు. అధికారంలోకి రావడానికి జగన్మోహనరెడ్డి ఎన్నో చెప్పారని.. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదని విమర్శించారు. ‘‘ఇసుక అక్రమ రవాణాను అరికడతామన్నారు. ఇప్పుడు… ఒకే కంపెనీకి ఇసుక కట్టబెట్టారు. అధికారంలోకి రాగానే మద్య నిషేధం అమలు చేస్తామన్నారు. కానీ… మద్యం అమ్మకాల ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు’’ అని విమర్శించారు. వైసీపీ చాలా పకడ్బందీగా ప్రణాళికలు వేసి పచ్చని కోనసీమలో చిచ్చురేపిందని పవన్ ఆరోపించారు. కోనసీమ అల్లర్లలో జనసేనకు ప్రమేయం లేదని స్పష్టం చేశారు. మంత్రి పినిపె విశ్వరూ్‌పను కూడా బాధితుడిని చేశారని తెలిపారు. వైసీపీని రౌడీలూ గూండాల మూకగా పవన్ అభివర్ణించారు. ‘‘కోనసీమలో నిరసనలు జరుగుతుంటే హోం మంత్రి ఏం చేశారు? వైసీపీ నేతలు ఈ గొడవలు కోరుకున్నారు. దీనివల్ల జనసేనకు నష్టం జరుగుతుందనుకుంటే అది వైసీపీ తెలివి తక్కువతనమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. కోనసీమలో కులాల మధ్య సమన్వయం కుదిరేలా, అంతరం తగ్గించేలా శాంతి పరిరక్షణ కమిటీలు వేస్తామని తెలిపారు.
తాను కులాలను కలిపేవాడినే తప్ప విడదీసే వాడినికానని పవన్ చెప్పారు. 2024 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. ‘‘సమాజంలోని వివిధ కులాలను వర్గ శత్రువులుగా వైసీపీ భావిస్తోంది. ఒకవైపు కమ్మ కులాన్ని వర్గ శత్రువుగా చూస్తూ.. మరోవైపు ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఆ కులం వైసీపీని నమ్ముతుందా? మత్స్యకారులను, శెట్టి బలిజలనూ, వైశ్యులనూ… మాతో కలిసి ఉన్నారనే కారణంతో కాపులనూ వైసీపీ వర్గ శత్రువులుగా చూస్తూ వేధిస్తోంది. బలమైన ఓటు బ్యాంకుగా వ్యవహరించిన ఎస్సీ సామాజికవర్గాన్ని కూడా ఇప్పుడు శత్రువుగానే వైసీపీ భావిస్తోంది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ.. ఇప్పుడు క్షత్రియ కులాన్ని వర్గ శత్రువుగా భావిస్తోంది’’ అని పవన్ పేర్కొన్నారు. అర్థం కాకుండా మాట్లాడటం బొత్స సత్యనారాయణకు ఉన్న కళ అని వ్యాఖ్యానించారు. డబ్బు ల విషయంలో మాత్రం బొత్స కరెక్టుగా మాట్లాడతారన్నారు. భారతీయ జనతా పార్టీతో జనసేన బంధం బలంగా ఉందని పవన్ వెల్లడించారు. తాను సీఎం అభ్యర్థినని బీజేపీ నేతలెవ్వరూ తనకు నేరుగా చెప్పలేదని పవన్ స్పష్టం చేశారు.