Congress Nava Sankalp Shibir: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది సామెత. అచ్చం అలాగే అదునుచూసి కాంగ్రెస్ పార్టీలో ఎవరికివారు ఫ్లడ్‌లైట్‌లోకి వస్తున్నారు. సొంత ఎజెండాతో కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తలను మచ్చిక చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఏ కోశాన అంతుపట్టవు. ఆ పార్టీలో వ్యక్తిగత ప్రజాస్వామ్యం గురించి చెప్పాల్సిన పని లేదు. గాంధీభవన్‌లో కుర్చీలాటలు ఎన్ని చూడలేదు. ప్రస్తుతం అలాంటి పనే మొదలుపెట్టారు భట్టి విక్రమార్క. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో భట్టి, మరికొందరు నాయకులు కీసరలో రెండు రోజులపాటు నవ సంకల్ప శిబిర్ పేరుతో మేథోమధన సదస్సు నిర్వహిస్తుండటం గమనార్హం.
పీసీసీ చీఫ్‌గా రేవంత్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌లో కొందరు నాయకులు నిమ్మకునీరెత్తినట్టు పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. నిజానికి కొందరు నాయకులు ఆయన ఎంపికను బాహాటంగా వ్యతిరేకించారు. ఎప్పుడు సందుదొరికినా రేవంత్ పని తీరును అధిష్టానానికి చేరవేస్తూ పితూర్లు చెప్పే పనిలో ఉన్నారు కొందరు నాయకులు. అయితే రేవంత్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ నేపథ్యంలో అప్పటివరకు స్థబ్దుగా ఉన్న మరో వర్గం నాయకులు ప్రత్యేక కార్యక్రమాలకు తెరలేపడం దుమారం రేగుతోంది.
Also Read: KK Death Mystery: సింగర్ కెకె మృతిపై అనుమానాలు… విచారణ చేపట్టిన పోలీసులు!
నవ సంకల్ప శిబిర్ కార్యక్రమాన్ని భట్టి విక్రమార్క భుజాలపై వేసుకున్నారు. అయితే ఈ సమావేశంలో రేవంత్‌కు వ్యతిరేకంగా భావిస్తున్న వారంతా పాల్గొంటున్నారు. అందుకోసం ఆరకు కమిటీలు భట్టి వేసారు. పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, దామదోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వీ.హనుమంతరావులు ఈ కమిటీలకు నేతృత్వం వహించడం విశేషం. పార్టీ పెద్దకు తెలియకుండా ఇలాంటి సభ నిర్వహించడం వెనుక కాంగ్రెస్‌లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. రేవంత్‌రెడ్డి లేకుండానే ఇలాంటి సమావేశాలు నిర్వహించడమేంటని రేవంత్ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌ను వ్యతిరేకించే మరో నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఈ శిబిరం బాధ్యతలు తీసుకోవడం కొసమెరుపు.
రేవంత్‌రెడ్డి అమెరికా నుంచి తిరిగొచ్చాక సమావేశం నిర్వహిస్తే సరిపోయేది కదా అని కాంగ్రెస్ న్యూట్రల్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా సమావేశం కొనసాగుతుండగా రేవంత్‌రెడ్డి వర్గీయులు చొరబడి అలజడి సృష్టిస్తే మరోమారు కాంగ్రెస్‌కు ముప్పుతిప్పలు తప్పవు. రాహుల్ రాకతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. ఈ సమావేశం గనుక ఇచ్చుల్లారం అయితే ఆ పార్టీ ప్రజల్లో మరింత చులకనవడం ఖాయం.
Also Read:Pavan Kalyan Shocked About KK Death: స్టార్ సింగర్ కెకె మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి