KCR Meets Uddhav Thackeray: కేసీఆర్ చేస్తున్న పనులను చూస్తుంటే.. ఆయన గతంలో కంటే చాలా సీరియస్ గానే ఈ సారి జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించాలని అనుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ మధ్య బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఇంకోవైపు జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు తెస్తానని చెబుతున్న ఆయన ఈ మేరకు అడుగులు కూడా చాలా చురుగ్గానే వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ముంబైలో కేసీఆర్ కలుసుకున్నారు. దీంతో రాజకీయంగా ఒక్కసారి ప్రకంపనలు రేకెత్తుతున్నాయి. కేసీఆర్ వెళ్లింది రాజకీయ పరంగానే అని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేక పార్టీలను ఒక్కటి చేస్తామని ఇప్పటికే కేసీఆర్ చెప్పారు. ఆ పనిలో భాగంగానే తన సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వెంట ఎంపీలు సంతోష్ కుమార్ తో పాటు కేకేశవరావు, రంజిత్ కుమార్ అలాగే బీబీ పాటిల్ ఉన్నారు. ఇక కేసీఆర్ కూతురు కవిత, సన్నిహితుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉండటం ఇక్కడ విశేషం.
అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్నామ్నాయ ప్రభుత్వం తీసుకురావాలని చేస్తున్న కామెంట్లకు ఇతర పార్టీల నుంచి బాగానే మద్దతు వస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీల అధినేతలు కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. ఇక కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిన శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కేసీఆర్‌ను తనతో లంచ్ మీటింగ్‌కు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
Also Read: CM KCR National Politics: జాతీయ రాజకీయాల కోసం ఈసారి ఎంపీగా పోటీ చేయనున్న కేసీఆర్ !?
ఇక వీరి సమావేశంలో ముఖ్యంగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీని గద్దె దింపాలంటే భావసారూప్యం ఉన్న పార్టీలను ఒక్క తాటిమీదకు తీసుకు రావాలని చర్చించుకున్నారు. మొన్నటికి మొన్న తన కుటుంబంతో కలిసి తమిళనాడుకు వెళ్లి సీఎం స్టాలిన్‌ను కలిసిన కేసీఆర్.. ఇప్పుడు ఉద్ధవ్‌ను కలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కూడా బీజేపీకి వ్యతిరేకమే. ఇక ఉద్ధవ్‌తో మీటింగ్ తర్వాత నేరుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలవనున్నారు కేసీఆర్. ఆయనతో కూడా రాజకీయాలే మాట్లాడనున్నట్టు సమాచారం.
ఏదేమైనా కేసీఆర్ ఇలా యాంటీ బీజేపీ రాజకీయాలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అది కూడా కేసీఆర్ వారి వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారు. వారందరినీ త్వరలోనే ఒకచోటకు మీటింగ్‌కు పిలవనున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక జరిగితే కేసీఆర్‌ను వారంతా ముందు ఉండి నడిపించమని కోరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో కూడా ఇలాగే అఖిలేశ్ తో, మమతతో భేటీ అయిన కేసీఆర్.. ఏదో చేస్తానని చెప్పి, చివరకు సైలెంట్ అయిపోయారు. మరి ఈసారి కూడా ఇలాగే హడావుడి చేసి సైలెంట్ అయిపోతారా లేదంటే బలంగా ముందుకు వెళ్తారా అన్నది చూడాలి.
Also Read: Telangana CM KCR: మూడో కూటమి ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు ఫలించేనా?
Recommended Video: