50-50.. కేసీఆర్ ఫిట్టింగ్ పెట్టేశాడు!

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌ జ‌ల వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేట్టు క‌నిపించ‌ట్లేదు. ఏపీ అక్ర‌మంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని తెలంగాణ‌.. అనుమ‌తి లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోందని ఏపీ.. ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల నేత‌లు మాట‌ల యుద్ధానికి తెర‌తీశారు. విష‌యం కృష్ణాబోర్డును దాటి కేంద్రానికి సైతం చేరింది. అయిన‌ప్ప‌టికీ.. ప‌రిష్కారం ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో.. నీటిపారుద‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన కేసీఆర్‌.. రెండు రాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నీటి స‌మ‌స్య‌పై […]

Written By: Bhaskar, Updated On : July 4, 2021 7:45 am
Follow us on

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య‌ జ‌ల వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేట్టు క‌నిపించ‌ట్లేదు. ఏపీ అక్ర‌మంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని తెలంగాణ‌.. అనుమ‌తి లేకుండా తెలంగాణ విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోందని ఏపీ.. ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల నేత‌లు మాట‌ల యుద్ధానికి తెర‌తీశారు. విష‌యం కృష్ణాబోర్డును దాటి కేంద్రానికి సైతం చేరింది. అయిన‌ప్ప‌టికీ.. ప‌రిష్కారం ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో.. నీటిపారుద‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన కేసీఆర్‌.. రెండు రాష్ట్రాల మ‌ధ్య నీటి పంప‌కాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

నీటి స‌మ‌స్య‌పై చ‌ర్చించేందుకు ఈ నెల 9న రెండు రాష్ట్రాల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించేందుకు కృష్ణాబోర్డు నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ స‌మావేశాన్ని ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్ కోరారు. జులై 20 త‌ర్వాత తెలంగాణ అంశాల‌ను కూడా చేర్చి, పూర్తిస్థాయి బోర్డును స‌మావేశ ప‌ర‌చాలని అన్నారు. అంతేకాదు.. జ‌లాల పంపకంపైనా ప్ర‌ధాన సూచ‌న చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న 66ః34 నిష్ప‌త్తిని తొల‌గించి.. 50ః50 నిష్ప‌త్తిలో నీటి పంప‌కాలు జ‌ర‌గాల‌ని డిమాండ్ చేశారు. ఆ విధంగా.. రెండు రాష్ట్రాల‌కు అందుబాటులో ఉన్న 811 టీఎంసీల నీటిని.. చెరో 405.5 టీఎంసీలుగా ట్రైబ్యున‌ల్ కేటాయించేంత వ‌ర‌కు వాడుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక‌.. ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్ప‌త్తి ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పేశారు. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల ప్రాజెక్టుల్లో నీటి ల‌భ్య‌త ఉన్నంత కాలం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్ప‌త్తి కొన‌సాగాల‌ని అధికారుల‌కు సూచించారు. విద్యుత్ ఉత్ప‌త్తిని ఆపాల‌ని చెప్పే హ‌క్కు కృష్ణాబోర్డుకు లేద‌ని అన్నారు. జ‌ల విద్యుత్ విష‌యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య ఎలాంటి ఒప్పందాలూ లేవ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

పులిచింత ప్రాజెక్టు నుంచి వ‌స్తున్న నీటిని ఏపీ స‌ర్కారు వాడుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌కాశం బ్యారేజీకి వ‌చ్చే నీటితో త‌మ అవ‌స‌రాలు తీర్చుకోవొచ్చ‌ని చెప్పారు. 51 శాతం క్లీన్ ఎన‌ర్జీని ఉత్ప‌త్తి చేయాల‌ని కేంద్రమే చెబుతోంద‌న్న కేసీఆర్‌.. థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్ప‌త్తి వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటోంద‌ని, కాలుష్యం పెరుగుతోంద‌ని అన్నారు.

ఇక‌, నీటిని వృథాచేస్తున్నామని ఏపీ దుష్ప్ర‌చారం చేస్తోంద‌ని, దీన్ని తిప్పికొట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. కేవ‌లం తెలంగాణ వాటాగా ఉన్న నీటితోనే విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్నామ‌ని చెప్పారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ విద్యుత్ ఉత్ప‌త్తి ఆగొద్ద‌ని, ప్రాజెక్టుల వ‌ద్ద ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త న‌డుమ ప‌నులు కొన‌సాగించాల‌ని ఆదేశించారు. దీంతో.. రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం ఇప్ప‌ట్లో ముగిసిపోయే ప‌రిస్థితి లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి, కృష్ణాబోర్డు భేటీపై అధికారులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ సర్కారు ఎలా స్పందిస్తుంది? అన్న‌ది చూడాలి.