ఏం చేశామన్నది కాదు.. ఎలా చేశామన్నది కూడా కాదు.. ఓట్లు పడ్డాయా లేదా? అన్నదే రాజకీయ పార్టీలకు గీటురాయి. చేసే ప్రతిపనీ తమ రాజకీయ ప్రయోజనాల కోసమే అయినా.. ప్రజల కోసమే అన్నట్టు కలరింగ్ ఇచ్చేవారు ఒకప్పటి రాజకీయ నేతలు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ‘‘ఓట్ల కోసమే పథకాలు తెస్తున్నాం. అయితే ఏందీ?’’ అని రివర్స్ లో దబాయించే రోజులు వచ్చేశాయి. ఈ ట్రెండ్ ను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ పోటీలుపడి మరీ ఫాలో అయిపోతున్నారు. వారి జోరు చూసి బేజారెత్తిపోతున్నాయి విపక్షాలు!
ఇలాంటి పరిస్థితుల్లో తన తురుపు ముక్కను బయటకు తీశారు కేసీఆర్. అదే ‘దళిత బంధు’ పథకం. నిజానికి ఈ పథకం ప్రకటించడానికి ముందు ఇంతలా చర్చనీయాంశం అవుతుందని గులాబీ దళపతి కూడా ఊహించారో లేదోకానీ.. రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోందీ పథకం. దేశంలోనూ చర్చనీయాంశం అయ్యింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ దేశంలో అత్యంత వెనుకబడిన వారి జాబితాలో దళితులు ముందు వరసలో ఉంటారు. వారికి ఈ 75ఏళ్ల స్వాతంత్ర్యంలో ఒనగూరింది ఎంత? అంటే.. అంతంత మాత్రమేనన్నది అందరూ చెప్పేమాట. అందువల్లే.. ఈ పథకం తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయ్యింది.
ఈ పథకం విపక్షాలకు కంట్లో నలుసుగా తయారైందని చెప్పొచ్చు. వారు ఈ పథకాన్ని వద్దని చెప్పలేకున్నారు. అలాగని సమర్థించనూ లేకపోతున్నారు. ఇది సరికాదు అంటే.. దళితుల దృష్టిలో విలన్ కావాల్సి వస్తుందేమోనని భయం. అంగీకరిస్తే.. కేసీఆర్ మరింత బలంగ తయారైపోతాడేమోనని బెంగ. ఇలాంటి పరిస్థితుల్లో.. ‘పథకం మంచిదే అయినప్పటికీ.. కానీ’ అంటూ అలా ముందుకెళ్తున్నారు. మిగిలిన బంధులను కూడా తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు లెక్కే లేదు. ఏడాదికి కనీసం 70 వేల కోట్లను ఈ పథకాలకు ఖర్చుచేస్తున్నారన్నది అంచనా. ఏదో పథకం పేరుతో నేరుగా జనాలకు డబ్బులు పంచేస్తున్నారు. దీంతో.. అక్కడి విపక్షాలు కూడా ఏమీ అనలేని పరిస్థితి. కక్కలేక.. మింగలేక అన్న పద్ధతిలో అవస్థలు పడుతున్నాయి. జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమం మీదనే తప్ప.. అభివృద్ధి గురించి పెద్దగా దృష్టిపెట్టిన దాఖలాల్లేవు. కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు వెళ్లిపోయాయి. అయినా.. జగన్ కు పెద్దగా వ్యతిరేకత రాలేదంటే కారణం.. సంక్షేమ పథకాలే అన్నది వాదన.
ఈ విధంగా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంక్షేమం అనే బాణాన్ని సంధిస్తూ.. విపక్షాలను కోలుకోలేకుండా చేస్తున్నాయి. మరి, సంక్షేమం పేరుతో జనాలకు నేరుగా డబ్బులు ఇచ్చేసి, ఓట్లు కొనే పద్ధతి సరైందేనా? అనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది. ప్రజలందరి సొమ్మును సామాజిక వర్గాల పేరుతో ఇలా పంచడం సమర్థనీయమేనా? అని కూడా అంటున్నారు. దీనివల్ల మిగిలిన వర్గాలు కూడా తమకూ అలాంటిది కావాలని కోరుకోరా? అంటే.. సరైన సమాధానం కనిపించని పరిస్థితి. మరి, ఈ రాజకీయాన్ని గుర్తించాల్సింది, మార్చాల్సింది ఎవరంటే.. కేవలం ప్రజలు మాత్రమే.