CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకట స్థితిలో పడ్డారు. వరుసగా రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మూడోసారి పార్టీని అధికారంలోకి తేవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలు ఆయనకు సహకరించడం లేదు. మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో పార్టీ ఈసారి గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచాయి. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. ఇప్పుడు ఇంట గెలస్తే చాలు అన్న పరిస్థితి ఏర్పడింది.
ఎవరి సహకారం తీసుకోవాలో తెలియని పరిస్థితి..
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బలం పెరిగింది. తెలంగాణలో బీజేపీ ఎదగదని భావించిన కేసీఆర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చారు. తనకు పూర్తి మద్దతు ఉన్నా.. కాంగ్రెస్‌ను బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ పని చేశారు. కొన్నాళ్లు పరిస్థితి బాగానే ఉంది. కానీ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారింది. ఒక్కసారిగా బీజేపీ అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనేస్థాయికి చేరింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదలైన బీజేపీ జైత్రయాత్ర తర్వాత జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల వరకూ కొనసాగింది. మునుగోడులోనూ కొద్దిపాటిలో ఓడిపోయింది. మరోవైపు ఇన్నాళ్లూ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో బలహీనపడింది. కానీ కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ కూడా లైన్‌లోకి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెస్సే దూకుడుగా ఉంది. పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. కర్ణాటక తర్వాత తెలంగాణనే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అధిష్టానం కూడా తెలంగాణపైనే ఫోకస్ పెట్టింది.
దీంతో మొన్నటి వరకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు. మొన్నటి వరకు బీజేపీని బంగాళాఖాతంలో కలపాలన్నారు.
తెలంగాణలో ఓడితే జాతీయ రాజకీయాలు కష్టమే..
తెలంగాణ ఎన్నికల ఓడిపోతే ఇక జాతీయ రాజకీయాల నుంచి బీఆర్‌ఎస్ తప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కేసీఆర్ ఎలాగైనా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు దగ్గర కావాలని చూస్తున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్‌కు దగ్గరైతే పరిస్థితిపై లెక్కలు..
ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి పనిచేసి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొన్న కర్ణాకట ఎన్నికల్లో జేడీఎస్ పరిస్థితి కూడా ఎటూ కాకుండా పోయింది. అంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, బీఎస్పీలు కూడా రెండు పార్టీలతో పనిచేశాయి. ఎన్‌సీపీ మాత్రం కాంగ్రెస్‌తోనే పనిచేసింది. ఒక్క మమతా బెనర్జీ మినహా మిగతా పార్టీలన్నీ ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయి. జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్‌తో వెళ్లాలనుకుటున్న కేసీఆర్ కూడా ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తే.. తాను ప్రధాని రేసు నుంచి తప్పుకున్నట్లే అవుతుంది. అదే సమయంలో బీజేపీకి ఎలా దగ్గర కావాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మరి ఎవరితో కలుస్తారు.. ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి.