Love Failure : ఆమె కోసం అంత పనిచేశాడు.. కానీ జీవితం సంకనాకిచ్చేసింది..

ఆపై విదేశాల్లో స్థిరపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. అంత గాఢంగా ప్రేమించిన ఆమె నన్ను అచేతనంగా విడిచిపెట్టి వెళ్లడం బాధేసింది. అదే గురుతులతో 15 సంవత్సరాలు బతుకుతున్నాను’

Written By: Dharma, Updated On : June 17, 2023 5:11 pm
Follow us on

Love Failure : అందరూ ప్రేమిస్తారు. అందులో కొందరే ప్రేమించబడతారు. కొందరే ప్రేమను పొందగలుగుతారు. చివరి వరకూ ప్రేమను కొనసాగించగలరు. అయితే ప్రేమించిన వ్యక్తి ఎంపికలో తప్పటడుగులు వేస్తే మాత్రం ఆ ప్రేమకు మూల్యం తప్పదు. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా వ్యధ తప్పదు. ఆ ప్రేమభగ్నమై.. వారి జీవితాలను దహించివేయక తప్పదు. అటువంటి రియల్ స్టోరీలోకి వెళదాం. ‘ఆమె చాలా అందంగా ఉంటుంది. పదో తరగతి వరకూ ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎంతో స్నేహంగా గడిపాం. చదువులోనూ, ఇతరత్రా విషయాల్లోనూ ఒకరినొకరు సహాయం చేసుకున్నాం. మా స్నేహంతో పాటు ప్రేమ పెరుగుతూ వచ్చింది. కానీ ఆమె ముందుగా తనలో ఉన్న ప్రేమను వ్యక్తపరచింది.

పదో తరగతి పాసయ్యాం. ఇద్దరం ఒకే కాలేజీలో చేరాం. రెండేళ్ల పాటు ఆట పాటలతో గడిపాం. ప్రేమలో ఏదో తెలియని అనుభూతిని పొందాం. ఒకరిని విడిచి ఒకరు విడిచిపెట్టుకోలేని స్థితికి చేరుకున్నాం. ఇప్పటిలా అప్పుడు సెల్ ఫోన్లు ఉండేవి కావు. కాలేజీకి సెలవు వచ్చిందంటే మనసుకు వెలితిగా ఉండేది. తరువాత రోజు ఒకరినొకరు చూసుకున్నాక మనసు కుదరుకునేది. ఇదేనా ప్రేమంటే. ప్రేమలో ఇంత స్వచ్ఛత, కమ్మదనం ఉంటుందా? అని ఆశ్చర్యమేసేది. మా మధ్య ఉన్న ప్రేమ స్నేహితుల ద్వారా అమ్మాయి కన్నవారికి తెలిసింది. వారు బెదిరించారు.. భయపెట్టారు. నాపై దాడిచేశారు. ఆమెను ఇంట్లో పెట్టి బంధించారు. అప్పటి నుంచి క్షణం ఒక యుగంలా గడిపాను.

ఆ సమయంలో నాకు సాయం చేసింది స్నేహితులు. కొంతమొత్తంలో డబ్బు ఇచ్చి అమ్మాయిని పట్టణం తీసుకుపోవాలని సలహా ఇచ్చింది వారే. వారే స్వయంగా అమ్మాయిని వారి ఇంటి నుంచి రైల్వేస్టేషన్ కు తీసుకొచ్చి నాకు అప్పగించారు. కోటికాంతుల కొత్త ఆశలతో మేము రైలులో పట్టణానికి బయలుదేరాం. ఓ గుడిలో వివాహం చేసుకున్నాం. చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాం. నేను ఓ దుకాణంలో పనికి చేరాను. 12 గంటల డ్యూటీ అయినా ప్రతీక్షణం ఆమె ఆలోచనలే. ఎప్పుడు ఇంటి వెళ్లిపోదామా అని అనిపించేది. ఆమె కూడా నా కోసం ఆశగా ఎదురుచూసేది. ప్రేమలో ఉన్న మధురక్షణాలను ఆస్వాదించాం.

అయితే మా ప్రేమకు రాహుకాలం దాపురించింది. ఆమెను వెతుక్కుంటూ కుటుంబసభ్యులు, బంధువులు పట్టణానికి వచ్చారు. ఆచూకీ కనుక్కున్నారు. నావైపు బంధువులను రప్పించారు. ఇరువర్గాలు పంచాయితీ పెట్టారు. జరిగిందేదో జరిగిపోయింది. పిల్లలను చంపుకుంటామా అంటూ చెప్పుకొచ్చారు. పిల్లలిద్దరి వయసు తక్కువగా ఉన్నందున మరికొద్దిరోజులు ఆగి ఘనంగా పెళ్లి చేద్దామని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. అప్పటివరకూ ఎవరి ఇంట్లో వారు ఉండాలని షరతు విధించారు. కానీ ఆ ఒప్పందం మొదలు ఆమె నాతో మాట్లాడలేదు. నాకు కనిపించలేదు. రోజులు నెలలయ్యాయి.. నెలలు సంవత్సరాలుగా మారుతున్నాయి. కానీ ఆమె ఆచూకీ లేదు. చివరకు స్నేహితుల ద్వారా ఆరాతీస్తే ఆమెకు వివాహమైందని చెప్పారు. దగ్గర బంధువు, ఆపై విదేశాల్లో స్థిరపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. అంత గాఢంగా ప్రేమించిన ఆమె నన్ను అచేతనంగా విడిచిపెట్టి వెళ్లడం బాధేసింది. అదే గురుతులతో 15 సంవత్సరాలు బతుకుతున్నాను’