Telangana Assembly Elections
Telangana Assembly Election 2023: తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. మరో మూడు రోజుల్లో నోటిఫికేషన్ కూడా రానుంది. దీంతో నామినేషన్లు ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టిపెట్టాయి. అధికార బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం అధికారం ఖాయమనే ధీమాతో ఉంది. బీజేపీ ఎవరికీ మెజారిటీ రాదని, అధికారం మాత్రం తమదే అని చెబుతోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో తెలంగాణలో నివసిస్తున్న ఏపీకి చెందిన సెటిటర్లలో 60 శాతం బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారు. దీంతో ఈ ఏడాది నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సెటిలర్లు ఎటువైపు?’ అనే చర్చ మళ్లీ మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ తదితర జిల్లాల్లో దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆంధ్రా సెటిలర్ ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు.
ప్రతీ ఎన్నికల్లో ప్రభావం..
తెలంగాణ ఉద్యమంలో మొదలైన సెంటిమెంట్, సెటిలర్ల ప్రభావం గడిచిన రెండు ఎన్నికల్లోనూ స్పష్టంగా ఉంది. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌తో ఓట్లు అడుగుతుంటే.. సెటిలర్లు తాము బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే ఏమౌతుందో అన్న భయంతో ఓట్లు వేశారు. ఈసారి సెటిలర్ల నిర్ణయం చాలా కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన, ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడమే ఇందుకు కారణం. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎన్నడూ లేనివిధంగా ఐటీ ప్రొఫెషనల్స్‌తోపాటు సెటిలర్లు రోడ్డు మీదకు వచ్చి పెద్ద ఎత్తున తమ నిరసన తెలిపారు. దీనిని గ్రహించిన అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ వారితో వైరం కన్నా.. మద్దతు కూడగట్టుకోవడమే మంచిదని భావించారు. ఐటీ శాఖ మంత్రి ఒకసారి ఐటీ ప్రొఫెషనల్స్ ఆందోళనను తప్పు పట్టారు. ఏపీలో బాబు అరెస్ట్ అయితే తెలంగాణలో ఆందోళనలు చేయడం ఏంటని తప్పు పట్టారు. కానీ, తర్వాత వెనక్కి తగ్గారు.
గ్రేటర్‌లో ఆరు నియోజకవర్గాల్లో
ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో సెటిలర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. చంద్రబాబు అరెస్ట్, కేటీఆర్ వ్యాఖ్యలతో సెటిలర్ల ఆలోచన మారిందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈమేరకు సెటిలర్లు ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఆరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా సెటిలర్లతో సమావేశాలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్, బీజేపీవైపు మొగ్గు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సెటిలర్ల ఓట్లు బీజేపీ, కాంగ్రెస్‌లకు చీలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు 20 శాతం ఓట్లు, బీజేపీ, కాంగ్రెస్‌కు 80 శాతం ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ప్రభావం, ఆయనకు తాజాగా బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయన ఇచ్చే పిలుపు మేరకు 30 నుంచి 40 శాతం మంది ఓట్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో జనసేన, పవన్‌కళ్యాణ్ అభిమానులు బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇలా బీజేపీకి 30 శాతంపైగానే సెటిలర్ల ఓట్లు పోలవుతాయని లెక్కలు వేస్తున్నారు. చంద్రబాబు నాయకుడు తెలంగాణ ఎన్నికల్లో రేవంత్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నందున కాంగ్రెస్‌కు కొంత మేలు జరుగుతుందని అంచనా.