
Teenmar Mallanna: క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ కు సోమవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత 74 రోజులుగా జైల్లోనే ఉన్న తీన్మార్ మల్లన్నపై 32 కేసుల్లో 31 కేసులకు ఇదివరకే బెయిల్ మంజూరయింది. పెండింగులో ఉన్న మరో కేసులో తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో బెయిల్ కోసం తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణల మీద నవీన్ కుమార్ ను ఆగస్టులో అరెస్టు చేశారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించి హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచే ఆయనను జైల్లోనే ఉంచారు. బయటకు రాకుండా చేసింది ప్రభుత్వం. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) భార్య కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి తన భర్తను విడిపించాల్సిందిగా కోరింది. అక్రమ కేసులు పెట్టి తన భర్తను బయటకు రాకుండా చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో జాతీయ బీసీ కమిషన్ సైతం కేసుల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కావడంతో ఇక తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టే అవకాశం ఏర్పడింది.
ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో జీర్ణించుకోలేని టీఆర్ఎస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్నపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టింది. దీనిపై బీజేపీ నేతలు స్పందించి ఆయనకు బెయిల్ రావడానికి సహకరించారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ఇక బీజేపీలో చేరి పోరాడనున్నట్లు తెలుస్తోంది.