TDP: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్లింది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థులను బరిలో దించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏపీలో సైతం తెలుగుదేశం పార్టీ ఇదే ఫార్ములాతో ముందుకెళ్తోంది. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు పై ఆధారపడితే లాభం లేదని.. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు అయితేనే గెలుపు సాధ్యమని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ దిశగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఖర్చుకు వెనుకాడని వారిని ఎంపిక చేయాలని చూస్తోంది.
ఎన్నికలు టిడిపికి చావో రేవో లాంటివి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఫలితం తారుమారు అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అధికార వైసిపి నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం ఆ స్థాయిలో ఖర్చు పెట్టే వారికి టిక్కెట్ కేటాయించనున్నట్లు చెబుతోంది. ఎవరైనా పోటీ చేసేందుకు ముందుకు వస్తే ముఖం మీద ఖర్చు విషయంలో స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి అధికార పార్టీ డబ్బు వెదజల్లుతుందని.. వారిని తట్టుకోవాలంటే మనం కూడా ఆ స్థాయిలో ఖర్చు పెట్టాలని.. అందుకు సిద్ధమేనా? అని ప్రశ్నిస్తున్నట్లు ఆశావాహులు చెబుతున్నారు.
ప్రతి నియోజకవర్గంలో కనీసం 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని.. ఆ మేరకు వైసిపి రెడీ చేస్తుందని టిడిపి నేతలు చెబుతున్నారు. పార్టీపరంగా పది నుంచి 15 కోట్ల వరకు ఇస్తామని ఆశావాహులతో టిడిపి అగ్రనాయకత్వం చెబుతున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పెట్టి ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా.. మిగిలిన మొత్తాన్ని భరించుకుంటేనే టిక్కెట్ ఇస్తామని హై కమాండ్ తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ఆశావాహులు పక్కకు తప్పుకుంటున్నారు. ఈ జాబితాలో కొంతమంది సీనియర్ నేతలు సైతం ఉండడం విశేషం. అంత ఖర్చు పెట్టడానికి ఎక్కువ మంది వెనుకడుగు వేస్తున్నారు.
అయితే ఈసారి చంద్రబాబు ఒక్కరే కాదు. అనుకూల మీడియా ప్రతినిధులు, సీనియర్ల సైతం స్క్రూట్ని చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో ఒకటి రెండు సీట్లు తప్పించి.. మిగతా చోట్ల వడపోత ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం. వైసిపి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆర్థికంగా ఇబ్బందులు లేని అభ్యర్థులనే రంగంలోకి దించాలని భావిస్తోంది. ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైనే ఆధారపడకుండా.. అధికార పార్టీతో సమానంగా డబ్బులు ఖర్చు చేసే వారిని ఎంపిక చేస్తోంది.