
Batchula Arjunudu : ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచాడు. డిసెంబర్ 28న గుండెపోటు రావడంతో ఆయనను విజయవాడలోని రమేశ్ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోజు నుంచి వెంటిలేటర్ పైనే బచ్చుల చికిత్స పొందుతున్నారు. ఆయనకు స్టంట్ వేసినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు.
గురువారం బచ్చుల ఆరోగ్యం మరింత క్షీణించి అవయవాలు అన్నీ పనిచేయకపోవడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అర్జునుడు మృతితో టీడీపీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బచ్చులను చూడడానికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి తరలివస్తున్నారు.
కరోనా సమయంలోనే బచ్చుల ఆరోగ్యం దెబ్బతింది. ఆయనకు రెండు సార్లు వైరస్ సోకింది. అప్పటి నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. కరోనా తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డారు. గుండెపోటు వచ్చింది.
టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ టీడీపీకి దూరం కావడంతో బచ్చులకే గన్నవరం టీడీపీ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. నాటి నుంచి నియోజకవర్గంలో అన్నీ తానై నిర్వహిస్తున్నారు.
-అర్జునుడు బయోడేటా
అర్జునుడు స్వస్థలం మచిలీపట్నం. తెలుగుదేశం ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. 1995-2000 వరకూ కోఆపరేటివ్ సోసైటీ (పీఏసీఎస్) అధ్యక్షుడిగా పనిచేశారు. 2000-2005 వరకూ మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్ గా పనిచేశారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2020లో టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా నియమితుడయ్యారు.