తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే మహానాడు కార్యక్రమం అంటే వేలాదిగా నాయకులు, భారీ బహిరంగసభ, వందల కొద్దీ వంటకాల మెనుతో వేల మందికి భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల రాజకీయ చర్చలు, తీర్మానాలతో మూడు రోజుల పాటు ఆర్భాటంగా నిర్వహించుకునే కార్యక్రమం. ఈ ఏడాది ఏ హడావిడి లేకుండా జరగనుంది. ఇందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. కరోనా కారణంగా ఇప్పట్లో భారీ సభలు, సమావేశాలకు అవకాశం కనిపించడం లేదు.
దీంతో ఓ వినూత్న ప్రయోగానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. వర్చువల్ మీడియా వేదికగా నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. లాక్‌డౌన్ దృష్ట్యా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మార్చి 29న టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించగా ఇప్పుడు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు అదే రీతిలో జరుగనుంది.
దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఈ స్థాయిలో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుండడం ఇదే తొలిసారని టీడీపీ ముఖ్యనేతలు తెలిపారు. సాధారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పదుల సంఖ్యలో నేతలతో భేటీకి అవకాశం ఉంటుంది. కానీ ఒకేసారి 10వేల మందితో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించడం సాధారణ విషయం కాదని వారు పేర్కొంటున్నారు.
ఏటా మే 27, 28, 29 తేదీల్లో మహానాడును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఎన్నికల దృష్ట్యా మహానాడు నిర్వహణ సాధ్యం కాలేదు.
లాక్‌డౌన్ ఎప్పటివరకు ఉంటుందో స్పష్టత లేకపోవడం, కరోనా వైరస్ దృష్ట్యా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి కావడంతో, ప్రత్యామ్నాయాలపై పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. జూమ్ కాన్పరెన్స్‌కు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని వారికి సూచించారు. దీంతో ఇందుకు అనుగుణంగా ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ వర్గాలు సిద్ధమవుతున్నాయి.