ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏ నేరం చేయకపోయినా నిందితులుగా చేర్చి అరెస్టు చేయాలని ఆదేశించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావుపై కృష్ణా జిల్లా పోలీసులు పెట్టిన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రానైట్ అక్రమ మైనింగ్ జరుగుతుందనే విషయం నిర్ధారణ కోసం దేవినేని ఉమ వెళితే వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఆయన కారులోనే ఉండిపోయినా ఆయనపై కేసులు నమోదు చేయడమేమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కారులోనే కూర్చున్న వ్యక్తిపై హత్యాయత్నం కేసు పెట్టడం ఏమిటి? ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం ఏంటి? అనే సందేహాలు వస్తున్నాయి. పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఆయన వాహనం సైతం ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. దీంతో గాయపడేందుకు కారకులైన వారిని అరెస్టు చేయాలని ఉమ కారులోనే నిరసనకు దిగారు. కారు అద్దం పగులగొట్టి పోలీసులు ఉమను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు.
దేవినేని ఉమపై అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదుపై టీడీపీ నేతలు కూడా పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సీనియర్ నేతలతో బేటీ అయ్యారు. దేవినేని ఉమపై పెట్టిన కేసులు భోగస్ అని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును అడ్డుకునేందుకు టీడీపీ సమాయత్తం అవుతోంది. పోలీసుల వ్యవహార శైలిని తప్పుపడుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు దేవినేని ఉమపై కేసు పెట్టడాన్ని ఖండించారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేవినేని కోసం త్రిసభ్య కమిటీని రంగంలోకి దింపి జగన్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. గురువారం రాష్ర్ట వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి తమ నిరసన తెలిపేందుకు టీడీపీ పిలుపునిచ్చింది.