TDP: 120 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు ఫిక్స్

గతంలో చంద్రబాబు నాన్చుడి ధోరణితో ఉండేవారు. చాలా రకాలుగా అది నష్టం చేసేది. ఈసారి అలా జరగకుండా ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : September 9, 2023 9:11 am

TDP

Follow us on

TDP: రాష్ట్రవ్యాప్తంగా 120 అసెంబ్లీ స్థానాలకు టిడిపి అభ్యర్థులు ఖరారు అయ్యారా? ఇంకా పెండింగ్లో 55 మాత్రమే ఉన్నాయా? ఇటీవల జిల్లాల పర్యటనకు వెళుతున్న చంద్రబాబు ఫుల్ క్లారిటీ ఇస్తున్నారా? వివాదాల్లేని నియోజకవర్గాల్లో పనిచేసుకోమని నేతలను పురమాయిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబుకు ప్రతిష్టాత్మకం. అందుకే ప్రతి నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తూ.. వాటి నివేదికల ఆధారంగా టిక్కెట్లు ఇస్తున్నారు.

గతంలో చంద్రబాబు నాన్చుడి ధోరణితో ఉండేవారు. చాలా రకాలుగా అది నష్టం చేసేది. ఈసారి అలా జరగకుండా ముందస్తుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 120 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఎక్కడా అధికారికంగా ప్రకటించడం లేదు. జిల్లా పర్యటనకు వెళ్తున్నప్పుడు.. నియోజకవర్గాల రివ్యూలు జరుగుతున్నప్పుడు.. గో హెడ్ అంటూ భుజం తట్టి పంపిస్తున్నారు. జనసేన, బిజెపితో పొత్తుల వ్యవహారం నడుస్తుండడంతో ఓ 55 స్థానాలను మాత్రం పెండింగ్లో పెట్టారు.

అనూహ్య పరిస్థితుల్లో వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరుతున్న ఎమ్మెల్యేలు, కీలక నాయకులకు సైతం టిక్కెట్లు కేటాయిస్తున్నారు. మొన్నటికి మొన్న పార్టీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం టికెట్ కేటాయించారు. నెల్లూరు రూరల్ ఇంచార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రకటించారు. ఆనం రామనారాయణ రెడ్డి కి సైతం కీలక స్థానం కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల కోసం కొన్ని స్థానాలను రిజర్వులో పెట్టినట్లు సమాచారం. గతం కంటే భిన్నంగా.. చంద్రబాబు స్పష్టంగా అభ్యర్థుల విషయంలో ముందుకెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే 55 నియోజకవర్గాలను రిజర్వులో పెట్టడం చర్చకు దారితీస్తోంది. అయితే ఇందులో బహుముఖ పోటీ ఉన్న నియోజకవర్గాలే అధికం. దీనికి తోడు జనసేనతో పాటు బిజెపికి పొత్తులో భాగంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సీట్లలో సింహభాగం జనసేనకేనన్న ప్రచారం జరుగుతోంది. జనసేన ఆశిస్తున్న ప్రాంతంలోనే ఈ నియోజకవర్గాలన్నీ ఉండడం విశేషం. జనసేనకు సంప్రదించే చంద్రబాబు వాటిని పెండింగ్లో పెట్టారని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. అయితే చంద్రబాబు ఎక్కడా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడం లేదు. జిల్లాల పర్యటనల్లో, అంతర్గత సమావేశాల్లో మాత్రమే ప్రస్తావిస్తున్నారు. మొత్తానికైతే టిక్కెట్ల విషయంలో చంద్రబాబు ఫుల్ క్లారిటీగా ఉన్నారన్నమాట.