https://oktelugu.com/

G20 Summit 2023: జీ_20 సమ్మిట్: మూడు కూటముల్లో.. మూలపుటమ్మ గా భారత్..

ఇక జీ 20 కార్యకలాపాలు రెండు దారుల్లో సాగుతాయి. అవి ఒకటి ఆర్థిక బాట.. ఇందులో ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు, ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ పన్ను విధానాలు, అనుసరించాల్సిన పరిష్కారాలు, సంస్కరణల గురించి చర్చిస్తుంటారు.

Written By:
  • Rocky
  • , Updated On : September 9, 2023 / 08:51 AM IST

    G20 Summit 2023

    Follow us on

    G20 Summit 2023: దేశ రాజధాని ఆతిథ్యం ఇస్తుండడంతో జీ_20 పేరు మార్మోగిపోతోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా ఆంటీ ప్రపంచ అగ్ర నేతలతో పాటు 40 కి పైగా దేశాల అధినేతలు హస్తినలో రెండు రోజులపాటు భేటీ కాబోతున్నారు. ఇంతకీ ఏమిటి ఈ జీ_20, దీన్ని లక్ష్యాలు ఏమిటి? ముందున్న సవాళ్ళు ఏమిటి?

    జీ_20 అంటే 20 సభ్యుల బృందం. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు.. అమెరికా, చైనా, భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియో, యూకే లతో పాటు ఐరోపా యూనియన్ కూ ఇందులో సభ్యత్వం ఉంది. స్థూలంగా చూస్తే g20 అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే, నడిపించే, మూడు కూటములు కలిసి ఏర్పడ్డ అతిపెద్ద కూటమి. అభివృద్ధి చెందిన జి 7 (అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, జపాన్, కెనడా) అభివృద్ధి చెందుతున్న బ్రిక్స్ ( బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) తో పాటు 27 సభ్య దేశాలు ఉన్న ఐరోపా యూనియన్ ఇందులో ఇమిడి ఉన్నాయి. జీ_7 అనేది భౌగోళిక రాజకీయాలు, అంతర్గత భద్రత మీద దృష్టి సారిస్తూ ఉంటుంది. జి20 అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, సవాళ్ళు, పరిష్కారాలను ప్రధానంగా చర్చిస్తుంది. జీ_20 అనేది దేశాల కూటమి అయినప్పటికీ ప్రపంచ జీడీపీలో దీనిది 85 శాతం వాటా. 60 శాతం జనాభాకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత లేకపోయినప్పటికీ.. సభ్య దేశాలు వాటిని గౌరవించి పాటిస్తాయి.

    అప్పటి నుంచే మొదలైంది

    1997లో తలెత్తిన తూర్పు ఆసియా దేశాల్లోని ఆర్థిక సంక్షోభం.. జి 20 ఏర్పాటుకు బీజం వేసింది. ఈ సంక్షోభం అనంతరం జి 7 దేశాల ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై చర్చ, సమన్వయం, సమస్యల పరిష్కారానికి ఒక విస్తృత వేదిక ఉండాలని నిర్ణయించారు. ఫలితంగా 1999 సెప్టెంబర్ లో జి20కి శ్రీకారం చుట్టారు. “కీలకమైన ఆర్థిక అంశాలు, సమస్యలపై చర్చించి, దేశాల మధ్య సమన్వయానికి వీలుగా అన్ని దేశాలూ ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఏర్పాటు చేస్తున్న కొత్త యంత్రాంగమే జి20” అని ప్రారంభంలో తమ ఉద్దేశాన్ని ప్రకటించారు. కేవలం ఆర్థిక అంశాలే ప్రధానంగా ఏర్పడింది కాబట్టి.. తొలుత జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు మాత్రమే ఏటా భేటీ అయ్యేవారు. కానీ 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ఈ సదస్సును సభ్య దేశాల దేశాల స్థాయికి పెంచారు. తొలి శిఖరాగ్ర సదస్సు 2008 నవంబర్లో వాషింగ్టన్ లో జరిగింది. ఏటా g20 సభ్య దేశాల అధినేతలు శిఖరాగ్ర సదస్సు నిర్వహించి చర్చిస్తుండగా.. ఆర్థిక మంత్రుల భేటీలు ఏటా రెండుసార్లు జరుగుతున్నాయి. తులత ఆర్థిక అంశాలకే పరిమితమైన జీ_20 తర్వాత వాణిజ్యం, ఇంధనం, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం పైనా చర్చించడం ఆరంభించింది. గత సదస్సులో రష్యా_ఉక్రెయిన్ యుద్ధం రూపంలో భౌగోళిక రాజకీయాలూ చర్చనీయాంశమయ్యాయి. అదే ఇప్పుడు సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని దెబ్బతీస్తోంది. ఈసారి సదస్సులోనూ ప్రకటనకు రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఇక జీ 20 కార్యకలాపాలు రెండు దారుల్లో సాగుతాయి. అవి ఒకటి ఆర్థిక బాట.. ఇందులో ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు, ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ పన్ను విధానాలు, అనుసరించాల్సిన పరిష్కారాలు, సంస్కరణల గురించి చర్చిస్తుంటారు. ఇందులో ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ఆర్థికాభివృద్ధి సమన్వయ సంస్థ లాంటి వాటిని భాగస్వాములను చేస్తారు.

    ఇందులో రెండవది షెర్పాల చర్చలు. దేశాధినేతలు నియమించే ప్రత్యేక ప్రతినిధినే షెర్పా అంటారు. అన్ని సభ్య దేశాల షెర్పాల మధ్య వ్యవసాయం, సంస్కృతి, డిజిటల్ ఎకానమీ, విద్య, ఇంధనం, పర్యాటకం.. తదితర చర్చలు జరుగుతాయి. ఇవే కాకుండా వ్యాపారావకాశాలపై జి20, ఆలోచనలపై థింక్ 20, మహిళలకు సంబంధించి విమెన్ 20.. లాంటి వేదికలు ఏడాది పాటు చర్చలు జరుపుతుంటాయి.