G20 Summit Delhi: 2008లో ప్రారంభమైన నాటి నుంచి జీ_20 కూటమి దాదాపు 2,500 హామీలు ప్రకటించింది. వీటిలో మాయా సభ్య దేశాలు 71% అమలు చేశాయని ఇటాలియన్ ఇనిస్ట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ పొలిటికల్ స్టడీస్ నివేదిక వెల్లడించింది. పన్నుల విషయంలో 85 శాతం, ఉపాధి 75%, ఆర్థిక నియంత్రణలో 78%.. అన్ని దేశాలు చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన సూచనలు చేసేందుకు “ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు” ఏర్పాటు చేయడం జి20 సాధించిన అతి పెద్ద విజయం గా చెబుతుంటారు. అయితే రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడం జీ_20 ప్రధాన బలహీనత.. అదే ఇప్పుడు కూటమిలో లుకలుకలకు కారణమవుతోంది. ఈసారి ఢిల్లీ సదస్సు తర్వాత సంయుక్త ప్రకటనకు అడ్డంకిగా మారుతుంది.
ఇవీ ఎదురయ్యే సవాళ్లు
రష్యా_ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం జీ_20 ముందు ఉన్న అతిపెద్ద సవాల్. కానీ యుద్ధంలో సభ్య దేశాల ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం కారణంగా జీ_20 ఇందులో ముందడుగు వేస్తుందని చెప్పడం కష్టమే. అనేక పేద, మధ్యతరగతి దేశాలు అప్పుల్లో కూరుకుని పోవడం, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి అగ్రదేశాలు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు హరిత ఇంధనం అందజేయడంలో అగ్రదేశాలు జాప్యం చేస్తుండడం, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు పనితీరులో సంస్కరణలు, ప్రపంచ ఆహార అభద్రత.. ఇవి జి 20 ముందు ఉన్న ప్రధాన సవాళ్లు.
చైనా ఏం చేస్తుందో
అమెరికా సహ అనేక పాశ్చాత్య దేశాలు ఉన్న జి20లో తానూ సభ్య దేశమైనప్పటికీ.. చైనా క్రమంగా ఈ కూటమి ప్రాధాన్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది అనే అనుమానాలు ఉన్నాయి. ఈసారి ఢిల్లీ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరు కాకుండా తన ప్రధానిని పంపించడానికి కూడా అదే కారణమని విశ్లేషకులు అంటున్నారు. జి 20 కి బదులుగా తన ప్రాబల్యం పెంచుకుంటున్న బ్రిక్స్ కూటమికి ప్రాధాన్యం ఇచ్చేందుకు చైనా మొగ్గు చూపుతోంది అని అమెరికా, ఇతర సభ్య దేశాల ఆరోపణ. ఉక్రెయిన్ తో తమ యుద్ధాన్ని ఈ ఆర్థిక వేదికపై ప్రస్తావించాల్సిన అవసరం లేదని రష్యా అంటున్నది. యుద్ధం వల్ల ఆర్థిక ఇబ్బందులను ప్రపంచమంతా ఎదుర్కొంటున్న నేపథ్యంలో చర్చించాల్సిందేనని అమెరికా ఇతర దేశాల వాదన. ప్రపంచ ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఏర్పడ్డ ఈ కూటమి లోనూ ఇలా భౌగోళిక రాజకీయాలు రంగ ప్రవేశం చేయడంతో మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.