ఏపీలో ‘గేటు’ రాజ‌కీయం!

కృష్ణాన‌ది వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పులిచింత‌ల ప్రాజెక్టు గేటు ఊడిపోయిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. ఒక సాగునీటి ప్రాజెక్టు గేటు ఊడిపోవ‌డం అనేది అసాధార‌ణం. నిపుణులు సైతం దీనిపై ఆశ్చ‌ర్యం, ఆందోళ‌న ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో.. రాష్ట్రంలో రాజ‌కీయం సైతం వేడెక్కింది. వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ గేటు రాజ‌కీయానికి తెర‌తీసింది. పాత విమ‌ర్శ‌ల‌ను త‌వ్వితీస్తూ.. వైఎస్ హ‌యాంలో అవినీతి య‌జ్ఞం జ‌రిగిందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేస్తోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో జ‌ల‌య‌జ్ఞం పేరుతో చేప‌ట్టిన […]

Written By: Bhaskar, Updated On : August 7, 2021 3:54 pm
Follow us on

కృష్ణాన‌ది వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పులిచింత‌ల ప్రాజెక్టు గేటు ఊడిపోయిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. ఒక సాగునీటి ప్రాజెక్టు గేటు ఊడిపోవ‌డం అనేది అసాధార‌ణం. నిపుణులు సైతం దీనిపై ఆశ్చ‌ర్యం, ఆందోళ‌న ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో.. రాష్ట్రంలో రాజ‌కీయం సైతం వేడెక్కింది. వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ గేటు రాజ‌కీయానికి తెర‌తీసింది. పాత విమ‌ర్శ‌ల‌ను త‌వ్వితీస్తూ.. వైఎస్ హ‌యాంలో అవినీతి య‌జ్ఞం జ‌రిగిందంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేస్తోంది.

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో జ‌ల‌య‌జ్ఞం పేరుతో చేప‌ట్టిన ప్రాజెక్టుల్లో పులిచింత‌ల కూడా ఒక‌టి. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు గేటు.. ఇటీవ‌లి వ‌ర‌ద‌లో కొట్టుకుపోయింది. దీంతో.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తోంది. వైఎస్ హ‌యాంలోనే ఈ ప్రాజెక్టు నాణ్య‌త‌పై టీడీపీ సందేహాలు వ్య‌క్తం చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టు గేటు ఊడిపోవ‌డంతో అవ‌కాశం అందివ‌చ్చిన‌ట్టైంది. దీంతో.. వైసీపీపై ఘాటుగా విమ‌ర్శ‌లు చేస్తోంది. ప్రాజెక్టులో నాణ్య‌త లేద‌ని తాము ఆనాడే చెప్పామ‌ని, ఇప్పుడు అది నిజ‌మైంద‌ని మండిప‌డుతోంది.

అటు వైసీపీ నేత‌లు ఎదురుదాడికి దిగుతున్నారు. దీనికి వాళ్లు చెప్పే మాట ఏమంటే.. టీడీపీ హ‌యాంలోనే ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేశారని. పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశారంటే.. అన్నీ స‌వ్యంగా ఉన్నాయ‌ని నిర్థారించుకున్న‌ త‌ర్వాత‌నే క‌దా అనుమ‌తి ఇచ్చేది? ఆ పని స‌రిగా చేయ‌లేదు కాబ‌ట్టి.. త‌ప్పు చంద్ర‌బాబుదే అన్న‌ది వారి వాద‌న. కానీ.. ఈ వాద‌న‌ నిల‌బ‌డ‌ట్లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మించిన వారిని వ‌దిలేసి, నీటిని నిల్వ చేసిన వారిని అన‌డ‌మేంటనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

తండ్రి హ‌యాంలో ప్రాజెక్టు నిర్మించ‌డం.. కొడుకు హ‌యాంలో గేటు ఊడిపోవ‌డం వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో.. టీడీపీ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు అధికార పార్టీ నేత‌లు. అంది వ‌చ్చిన అవ‌కాశాన్ని టీడీపీ వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. వ‌రుస‌గా ప్ర‌తీ ఎన్నిక‌ల్లో దెబ్బ తీస్తున్న వైసీపీని ఎదుర్కొనేందుకు ఇది మంచి అస్త్రంగా చంద్ర‌బాబు భావిస్తున్నారు. అటు ఏదోర‌కంగా ఈ ఇష్యూను ఓవ‌ర్ టేక్ చేసేందుకు వైసీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.