
Tenali Municipal Council Meeting: వారంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. స్థానిక సమస్యలను గాలికొదిలేసిస్వ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చారు. టెండర్ల విషయంలో చెలరేగిన వివాదం కొట్టుకునేంత వరకు వెళ్లింది. చొక్కాలు చించుకున్నారు. పలురువు కౌన్సిలర్ల గాయాలపాలయ్యారు. ఏపీలోని తెనాలిలో జరిగిన ఈ సంఘటన గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున ఆంధ్రా ప్యారిస్‌గా పేరుగాంచిన తెనాలిలో కౌన్సిల్ సమావేశం జరిగింది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై చర్చించకుండా సభను పక్కదారి పట్టించారు. వ్యక్తిగత పట్టింపులకు వెళ్లారు. టీడీపీ కౌన్సిలర్లు టెండర్ల విషయంలో గట్టిగా వైసీపీ సభ్యలను నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ సభ్యుల వైపు ఒక్క ఉదుటున పరుగెత్తుకువచ్చారు. పక్కనున్న వారు వారిస్తున్నా వినలేదు. ఆర్యవైశ్య కౌన్సిలర్ దేసు యుగంధర్ ను టార్గెట్ చేసుకొని దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఇరువైపుల కౌన్సిలర్ల చొక్కాలు చినిగిపోయాయి. అడ్డుకుంటున్న వారిని కూడా వైసీపీ సభ్యలు పక్కకు నెట్టేశారు. కౌన్సిల్ సభలో జరిగిన ఈ హఠాత్పరిణామంతో మిగతా సభ్యులు నిర్ఘాంతపోయారు. ఎంత వారించినా వినలేదు. ఘర్షణలకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో పోలీసులు కౌన్సిల్ హాల్లోకి రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. మున్సిపాలిటీ చైర్మన్ సభను అర్థాంతరంగా వాయిదా వేశారు. అనంతరం టీడీపీ కౌన్సిలర్లు తమకు న్యాయం చేయాలని మున్సిపాలిటీలో కూర్చొని నిరసనకు దిగారు.

కాగా, మున్సిపాలిటీలో జరిగిన ఈ ఘటనపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా సభ్యులు వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కౌన్సిల్లో సభ్యులు విచక్షణ కోల్పోవడం ఏమిటని అంటున్నారు. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కౌన్సిల్లో జరిగిన ఘటన ఆ పార్టీ నేతల వ్యవహార శైలిపై చర్చనీయాంశంగా మారింది.