Minister Vidadala Rajini: కొత్త సంవత్సరం వేళ మంత్రి విడుదల రజిని కార్యాలయంపై దాడి.. అసలేమైందంటే?

ఆదివారం అర్ధరాత్రి దాటాక టిడిపి, జనసేన శ్రేణులు నూతన సంవత్సరం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి విడదల రజని కార్యాలయానికి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

Written By: Dharma, Updated On : January 1, 2024 10:24 am
Follow us on

Minister Vidadala Rajini: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యానగర్ లోని మంత్రి విడదల రజిని నూతన పార్టీ కార్యాలయం పై రాళ్లదాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారంతా టిడిపి, జనసేన కార్యకర్తలుగా తేలింది. చిలకలూరిపేట ఎమ్మెల్యే గా ఉన్న మంత్రి విడదల రజినీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జిగా హై కమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆదివారం అర్ధరాత్రి దాటాక టిడిపి, జనసేన శ్రేణులు నూతన సంవత్సరం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి విడదల రజని కార్యాలయానికి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఈ బృందంలోని కొంతమంది విడదల రజినీ కార్యాలయం పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కార్యాలయానికి సంబంధించి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ నేతలు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు కొంతమంది టీడీపీ, జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ ఘటనతో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ఉన్నవారు ఏం జరిగిందో తెలియక భయపడ్డారు. అటు టిడిపి, ఇటు వైసీపీ శ్రేణులు పరస్పరం దుమ్మెత్తు పోసుకుంటున్నాయి. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మంత్రి విడదల రజినీకి ఇన్చార్జిగా నియమించడంతో సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అయితే ఘటనకు బాధ్యులను చేస్తూ టిడిపి, జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడంతో ఈ ఘటన కొత్త టర్న్ తీసుకుంది.