https://oktelugu.com/

Electricity bill: కరెంటు బిల్లు కట్టాలా వద్దా… ఈ విషయం తెలుసుకోండి!

ఇదిలా ఉండగా డిసెంబర్‌ నెలకు సంబంధించిన బిల్లులు పంపిణీకి విద్యుత్‌ శాఖ సిద్ధమైంది. జనవరి 2 నుంచి బిల్లులు పంపిణీ చేయనుంది.

Written By: , Updated On : January 1, 2024 / 10:17 AM IST
electricity-bill
Follow us on

Electricity bill: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి ఇక ఎవరూ కరెంటు బిల్లులు కట్టొద్దని కూడా సూచించారు. ఓటర్లు కాంగ్రెస్‌ హామీలను నమ్మారు. ఓట్లు వేసి గెలిపించారు. రేవంత్‌రెడ్డే సీఎంగా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల కావస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు కూడా కొత్త సర్కార్‌ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడ కరెంటు బిల్లు కట్టాలా.. వద్దా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బిల్లుల పంపిణీ..
ఇదిలా ఉండగా డిసెంబర్‌ నెలకు సంబంధించిన బిల్లులు పంపిణీకి విద్యుత్‌ శాఖ సిద్ధమైంది. జనవరి 2 నుంచి బిల్లులు పంపిణీ చేయనుంది. విద్యుత్‌ సబ్సిడీపై ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బిల్లు చెల్లించాల్సిందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నెల రోజులే అయినందున బిల్లులు కట్టక తప్పని పరిస్థితి నెలకొంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మందిపై ప్రభావం చూపే విద్యుత్‌ బిల్లు మాఫీని అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపును లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగించాలంటే హామీలు అమలు చేయాల్సిన పరిస్థితి.

డిసెంబర్, జనవరి బిల్లులు కట్టాల్సిందే.
వంద రోజుల్లో అమలు చేస్తామని ముందే ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలు డిసెంబర్, జనవరి నెలల బిల్లులు చెల్లించక తప్పదు. ఫిబ్రవరి నుంచి మాఫీ అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఎన్నికల వేళనే బిల్లు కట్టొద్దన్న రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు బిల్లులు వసూలు చేయడం విపక్షానికి అస్త్రంగా మారే అవకాశం ఉంది.

అవకాశం కోసం చూస్తున్న బీఆర్‌ఎస్‌…
మరోవైపు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇరుకున్న పెడదామా అని బీఆర్‌ఎస్‌ కాచుకు కూర్చుంది. ఇప్పుడు ఈ కరెంటు బిల్లుల అంశం ప్రతిపక్షానికి అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కరెంటు బిల్లులు కట్టాలో వద్దో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని గుర్తుచేశారు. మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

స్పష్టత కావాలి..
రాష్ట్రంలో చాలా మంది నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్‌ వినియోగిస్తున్నారు. వారంతా ఉచిత విద్యుత్‌ పథకానికి అర్హులు కావాలి. డిసెంబర్, జనవరి చెల్లించాలా వద్దా అని చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు.