https://oktelugu.com/

కొలిక్కిరాని కూటమి లెక్కలు.. పొత్తులు సరే.. టికెట్ల మాటేంటి?

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ–జనసేన టికెట్లు ఖరారుకు ఇప్పటికే ఐదుసార్లు సమావేశమయ్యాయి. చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌ శనివారం కూడా మంతనాలు జరిపారు.

Written By: , Updated On : February 5, 2024 / 03:32 PM IST
TDP and Jana Sena alliances What about tickets
Follow us on

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో అధికార వైసీపీతోపాటు, విపక్ష టీడీపీ, జనసేనతోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఎన్నికలు సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు. మరోవైపు వైసీపీ మళ్లీ అధికారం దక్కించుకునేందుకు వ్యూహం రచిస్తోంది. అభ్యర్థుల మార్పుతోపాటు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

టిక్కెట్లపై చర్చలు..
ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ–జనసేన టికెట్లు ఖరారుకు ఇప్పటికే ఐదుసార్లు సమావేశమయ్యాయి. చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌ శనివారం కూడా మంతనాలు జరిపారు. కానీ, టిక్కెట్ల లెక్కలు తేలడం లేదు. మరోవైపు టీడీపీ అధినేత పవన్‌ను సంప్రదించకుండానే రెండు టికెట్లు ప్రకటించారు. దీంతో జనసేన అధినేత పవన్‌ కూడా రెండ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేపారు. దీంతో కూటమి ఉంటుందా విచ్ఛన్నం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతన్నాయి.

చర్చలకే పరిమితం..
కలిసి పోటీ చేస్తామని చెప్పడం మినహా.. టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టలేదు. గతంతో విశాఖలో పవన్‌ను అడ్డుకున్నప్పుడు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తర్వాత చంద్రబాబు అరెస్ట్‌ అయిన తర్వాత జైలుకు వెళ్లి ములాఖత్‌ అయిన జనసేనాని.. తర్వాత మీడియాతో మాట్లాడి ఆవేశంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఐదు సార్లు భేటీ అయ్యారు. కానీ, ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడలేదు.

గోప్యతకు కారణం ఏంటి?
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పొత్తుల గురించి చర్చించేందుకు పలుమార్లు సమావేశం అయినా.. ఏం మాట్లాడుకున్నారో రివీల్‌ చేయడం లేదు. అంతా గోప్యత పాటిస్తున్నారు. భేటీ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. చివరకు సొంత పార్టీ నేతలకు కూడా చర్చల సారాంశం చెప్పడం లేదు. దీంతో క్యాడర్‌ ఎవరికి నచ్చింది వారు మాట్లాడుకుంటున్నారు. ఇక టీడీపీ అపనుకూల మీడియా మాత్రం కొన్ని కథనాలు వండి వారుస్తోంది. తాజాగా శనివారం జరిగిన చర్చల్లో సీట్ల పంపకాల గురించి మాట్లాడుకున్నారని టీడీపీ అనుకూల మీడియా వార్తలు రాసింది. ఇందులో టీడీపీ జనసేనకు వచ్చే ఎన్నికల్లో 25 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పారని పేర్కొంది. ఇక జనసేనాని మాత్రం తనకు వచ్చే ఎన్నికల్లో 35 అసెంబ్లీ, 7 లోక్‌సభ స్థానాలు కావాలని అడిగారని తెలుస్తోంది. అయితే దీనిపై ఏ పార్టీ నేతలు అధికారికంగా ధ్రువీకరించడం లేదు. దీంతో క్యాడర్‌లో గందరగోళం కనిపిస్తోంది.