AP Assembly Session: అసెంబ్లీ నుంచి ఔట్.. టీడీపీ పీచేముడ్

అంతకు ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రస్తావించిన అంశాలపై అభ్యంతరం తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : February 5, 2024 3:43 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ చివరి అసెంబ్లీ సమావేశాలు సోమవారం(ఫిబ్రవరి 5న) ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగంతో మొదలు పెట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ మాట్లాడిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. ఇందులో బడ్జెట్‌ సమావేశాలను ఈనెల 8 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించింది.

గవర్నర్‌ ప్రసంగంపై నిరసన..
అంతకు ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రస్తావించిన అంశాలపై అభ్యంతరం తెలిపారు. అనంతరం స్పీచ్‌ కొనసాగుతుండగానే సభనుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబీ లాబీల్లో నినాదాలు చేశారు.

బీఏసీ సమావేశం..
తర్వాత అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్‌ చాంబర్‌లో బీఏసీ సమావేశం నిర్వహించారు. రేపు(ఫిబ్రవరి 6న) గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చించనున్నారు. చర్చ తర్వాత సీఎం జగన్‌ సమాధానం ఇస్తారు. ఈ సందర్భంగా గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ, సామాజిక న్యాయం గురించి వివరించనున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చామని జగన్‌ వివరిస్తారని తెలుస్తోంది.

7న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
ఫిబ్రవరి 7న అసెంబ్లీలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌ మూడు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. మండలిలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 8వ తేదీన బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలిపేలా బీఏసీలో నిర్ణయించారు.

ఆకర్షణీయంగా బడ్జెట్‌..
ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్‌పై చర్చ తర్వాత సీఎం జగన్‌ కీలక ప్రసంగం చేస్తారని సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంలో ఇవి చివరి సమావేశాలు కావటంతో.. చివరి రోజున జగన్‌ తన ఐదేళ్ల పాలనను వివరిస్తూ ప్రజలకు అసెంబ్లీ వేదికగా సందేశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రసంగం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.