తమిళ పాలిటిక్స్ లో ముందెన్నడూలేని పరిస్థితి ఇది. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద పులులుగా ఉన్న కలైంజర్ కరుణానిధి, పురుచ్చి తలైవి జయలలిత లేకుండా ఇప్పుడు ఎన్నికల సమరం సాగుతోంది. వీరిద్దరూ లేకుండా సాగుతున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుసగా.. మళ్లీ అధికారం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని అన్నాడీఎంకే భావిస్తుండగా.. ఎలాగైనా ఈ సారి జెండా ఎగరేయాలని డీఎంకే పోరాడుతోంది. పొత్తులు ముగిసిన వేళ.. కొత్త ఎత్తులకు తెరలేస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు తమవైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి పార్టీలు.
Also Read: ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ తో ఆ లక్షణాలకు చెక్..?
గత చరిత్ర తవ్వితీసినా.. వర్తమానాన్ని వడపోసినా.. తమిళ రాజకీయాల్లో ఓ ప్రత్యేకత కనిసిస్తుంది. అదే ప్రాంతీయ పార్టీల హవా. ద్రవిడ సంస్కృతిని అభిమానించే తమిళులు.. జాతీయ పార్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచన ఎప్పుడో విరమించుకున్నారు. కేంద్రంలో యూపీఏ హవా సాగినప్పుడైనా.. మోడీ గాలి బీభత్సంగా వీచినప్పుడైనా తమిళనాట మాత్రం అదే పరిస్థితి కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోవడం ఇందుకు నిదర్శనం. అయితే.. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. జయలలిత, కరుణానిధి లేని ఈ సంధికాలాన్ని తాము వినియోగించుకోవాలని జాతీయ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో బీజేపీ అన్నాడీఎంకేతో జట్టుకట్టింది. జయ మరణం తర్వాత నుంచీ ఈ పార్టీ కమలంతో చెలిమి చేస్తోంది. అయితే.. ఈసారి అసెంబ్లీలో అడుగుపెడితే చాలని భావించిందో ఏమోకానీ.. బీజేపీ 20 స్థానాల్లో మాత్రమే పోటీచేస్తోంది. అటు తన ఉనికిని చాటుకునే కాంగ్రెస్ కూడా 25 స్థానాల్లోనే పోటీచేస్తోంది. కూటమి లీడర్ గా ఉన్న డీఎంకే ఈ సారి సీట్లను తగ్గించింది. ఈ నేపథ్యంలో.. జయ, కరుణ లేకున్నా పోరు మాత్రం ప్రాంతీయ పార్టీల మధ్యనే అనేది స్పష్టమైంది.
ఇక, మరో ఆసక్తికర పరిణామం కమల్ పార్టీ తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కోబోతుండడం. తమిళనాట సినీ నటుడిగా కమల్ స్థాయి ఏంటనేది అందరికీ తెలిసిందే. ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. మరి, ఆ అభిమానం ఓట్లరూపంలో ఎంత వరకు మారుతుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. శరత్ కుమార్ పార్టీతోపాటు మరో పార్టీతో జట్టుకట్టి రంగంలోకి దిగారు కమల్.
Also Read: షాక్ లగా: వైఎస్ షర్మిల పోటీచేసే నియోజకవర్గం ఇదే
అయితే.. ప్రధాన పోరు డీఎంకే-అన్నాడీఎంకే మధ్యనే ఉంటుందంటున్నారు విశ్లేషకులు. ప్రీ-పోల్ సర్వేలైతే ప్రజలు మూకుమ్మడిగా స్టాలిన్ కే పట్టం కట్టబోతున్నారని తేల్చేశాయి. కానీ.. ఆ సర్వేలు అప్పుడెప్పుడో వచ్చాయి. కుదిరిన పొత్తులను బట్టి, సాగుతున్న ప్రచారం బట్టి, ఇస్తున్న హామీలను బట్టి పోలింగ్ నాటికి ఓటరు ఆలోచన మారొచ్చు. అందుకే.. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు హామీల మీద హామీలు గుప్పిస్తున్నాయి.
అమ్మ పథకాలతో ఏఐడీఎంకే హోరెత్తిస్తుండగా.. కరెంట్ ఇష్యూ అయిన పెట్రోల్ రేట్ తగ్గింపు సహా.. జయలలిత మరణం దర్యాప్తు వరకు ఎన్నో హామీలు ఇచ్చేస్తోంది డీఎంకే. చివరకు నాస్తికం పునాదుల మీద నుంచి పక్కకు జరిగి, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే వారికి ఆర్థిక సహాయం అంటూ ప్రకటించారు స్టాలిన్. బీజేపీ తెస్తున్న హిందూ వ్యతిరేక ప్రచారానికి విరుగుడు అన్నట్టుగా ఇలాంటి వాగ్దానాలు కూడా చేస్తున్నారు. నీట్ పరీక్ష రద్దు డిమాండ్ కూడా ప్రధానాంశంగా మారడంతో దాన్ని కూడా వాడేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటులో సమర్థించిన అన్నాడీఎంకే.. ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం ఆ చట్ట రద్దుకు కేంద్రంపై ఒత్తిడి చేస్తామని చెబుతుండడం గమనార్హం. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీలు.. కాదేదీ హామీకి అనర్హం అంటూ వాగ్ధానాలు ఇచ్చేస్తున్నాయి. వరాలు కురిపించేస్తున్నాయి.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు కావాలి. ఈ మ్యాజిక్ ఫిగర్ ను దక్కించుకునేందుకు ప్రత్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏప్రిల్ 6న పోలింగ్ జరగబోతుండగా.. మే2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరి, ఈ వరాల వానలో తడిసిపోతున్న ఓటరు ఎవరివైపు నిలుస్తాడు? అన్నదే ఆసక్తికరం.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్