
హాలీవుడ్ మూవీ ‘గాడ్జిల్లాVsకాంగ్’ ఇండియాలో సత్తా చాటుతోంది. భారతీయ చిత్రాలను మించిన ఓపెనింగ్స్ తో రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే.. ఇంటర్నేషనల్ రిలీజ్ కు రెండు రోజుల ముందుగానే ఇండియాలో రిలీజ్ కావడం విశేషం. మన దేశంలో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. అయితే.. తొలిరోజు పలు చోట్ల మంచి కలెక్షన్లు సాధించింది.
ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. విడుదలైన తొలిరోజునే తెలుగు రాష్ట్రాల్లో రూ.4.5 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఇది చాలా తెలుగు సినిమాలు సాధించిన కలెక్షన్ కన్నా ఎక్కువ.
ఇక, సౌత్ తో కంపేర్ చేసినప్పుడు ఉత్తరాదిన మాత్రం తక్కువ కలెక్షన్లు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుండడంతో.. థియేటర్ కు వెళ్లేందుకు జనాలు ఆలోచిస్తున్నారు. దీంతో.. కలెక్షన్లు పడిపోయాయి. పలు చోట్ల థియేటర్లలో ఆక్యుపెన్సీ 20 శాతానికి మించడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రాలకన్నా మెరుగ్గా ‘గాడ్జిల్లాVsకాంగ్’ కలెక్షన్లు ఉన్నాయని చెబుతున్నాయి. జాన్వీ కపూర్ నటించిన ‘రూహీ’, జాన్ అబ్రహం నటించిన ‘ముంబై సాగా’ ఈ మధ్యనే రిలీజ్ అయ్యాయి. కానీ.. ఆ చిత్రాల కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. వాటితో పోలిస్తే.. ‘గాడ్జిల్లాVsకాంగ్’ కలెక్షన్లు చాలా మెరుగ్గా ఉన్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.