Sunita Williams
Sunita Williams : భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunitha Williams) ఇటీవలే అంతరిక్షం నుంచి వచ్చారు. వారం రోజుల పర్యటన కోసం 2024 జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతావిలియమ్స్.. అక్కడే 9 నెలలు చిక్కుకుపోయారు. మార్చి 19న భూమిపైకి వచ్చారు. ఈ సందర్భంగా అంతరిక్షం నుంచి భారతదేశాన్ని చూసిన అనుభవాన్ని అద్భుతంగా వర్ణించారు. 286 రోజుల అంతరిక్ష యాత్ర తర్వాత ఆమెను ‘భారతదేశం అంతరిక్షం నుంచి ఎలా కనిపించింది?‘ అని అడిగితే, ‘అద్భుతం.. అత్యద్భుతం‘ అని సమాధానమిచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(International Space Centar) నుంచి హిమాలయాలను చూసినప్పుడు ఆమె మంత్రముగ్ధురాలైనట్లు చెప్పారు. ‘మేము హిమాలయాల మీదుగా వెళ్లిన ప్రతిసారీ అద్భుత దృశ్యాలను చూశాం. పశ్చిమాన నౌకాదళాల నుంచి ఉత్తరాన మెరిసే హిమాలయాల వరకు, తూర్పున గుజరాత్ మీదుగా ముంబై వరకు అన్నీ అద్భుతంగా కనిపించాయి‘ అని ఆమె వివరించారు.
Also Read : సునీత విలయమ్స్ విషయంలో ట్రంప్ గొప్ప మనసు
భారతీయురాలిగా గర్వపడుతూ..
సునీతా విలియమ్స్ తన భారతీయ మూలాల గురించి ఎప్పుడూ గర్వంగా మాట్లాడుతుంటారు. రాత్రిపూట భారతదేశం అంతటా మెరిసేలైట్ల నెట్వర్క్, పగటిపూట హిమాలయాల సౌందర్యం ఆమెను ఆకట్టుకున్నాయి. ‘హిమాలయాలు(Himalayas) భారతదేశానికి తలమానికం‘ అని ఆమె అన్నారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో సహాయం చేయడం గురించి అడిగినప్పుడు, ‘ఎప్పుడో ఒకసారి భారత్‌కు వస్తాను. నా అనుభవాలను అక్కడి వారితో పంచుకుంటాను. భారత్ ఒక గొప్ప దేశం, అద్భుతమైన ప్రజాస్వామ్యం ఇక్కడ ఉంది. అంతరిక్ష రంగంలో భారత్ ముందడుగు వేస్తోంది, దానిలో భాగం కావడం నాకు ఇష్టం‘ అని ఆమె చెప్పారు.
ఇండియాకు ఎప్పుడు వస్తారో..
ఇండియాకు వస్తానని సునీతా విలియమ్స్ ప్రకటించారు. దీంతో ఆమె ఎప్పుడు వస్తారనన చర్చ జరుగుతోంది. భూమిపైకి రాకముందే ప్రధాని మోదీ కూడా సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు. ఇక సునీతా విలియమ్స్, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి 2024 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌లో ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష నౌక సిబ్బంది లేకుండా తిరిగి వచ్చింది. దీంతో వీరిద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. చివరికి 2025 మార్చి 19న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వచ్చారు.
భారతీయ మూలాలు..
సునీతా తన తండ్రి పూర్వీకుల స్థలమైన భారత్‌కు రావాలని, బుచ్ విల్మోర్‌ను కూడా తీసుకురావాలని ఆలోచిస్తోంది. నాలుగు దశాబ్దాల క్రితం భారత వ్యోమగామి రాకేష్ శర్మ ‘సారే జహాన్ సే అచ్చా‘ అని అంతరిక్షం నుంచి భారత్‌ను వర్ణించగా, సునీతా కూడా భారత సౌందర్యాన్ని ‘అద్భుతం‘గా అభివర్ణించారు. ఆమె అనుభవాలు భారత అంతరిక్ష రంగంలో యువతకు స్ఫూర్తినిస్తాయని ఆశిద్దాం.
Also Read : సమోసా, గణేశుడి ప్రతిమ, భగవద్గీత.. నింగిలోనూ సునీత భారతీయత..