Telangana Congress: ఇపుపడు కాకుంటే.. ఎప్పుడూ కాదు.. ఇదీ ఇప్పుడు టీ కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది ఆ పార్టీ. ఇందులో భాగంగా ఈసారి భారీ మార్పులు చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధులలో 90 శాతం మందిని ఖరారు చేసేసిన కాంగ్రెస్… మిగతా స్ధానాల్లోనూ కసరత్తు పూర్తి చేస్తోంది. పలు చోట్ల అభ్యర్ధులపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాబితా ఆలస్యమవుతుందని భావించినా.. అంతకు మించిన సమీకరణాలను కాంగ్రెస్ పెద్దలు వర్కవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నాటక ఫార్ములా మక్కికి మక్కీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊపుతెచ్చేందుకు పనికొచ్చిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఆ పార్టీకి అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి ఫార్ములాను ఇక్కడ మక్కికి మక్కీగా అమలు చేస్తున్నారు. కర్నాటకలో బీజేపీని మట్టికరిపించి విజయం సాధించడం ఓ ఎత్తయితే ప్రత్యర్ధులు ఊహించని స్ధాయిలో సీట్లు కైవసం చేసుకోవడానికి వెనుక ఉన్న కారణాల్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోవడం లేదు. అదే ఫార్ములాని తెలంగాణ అసెంబ్లీ పోరులోనూ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
టికెట్ల కేటాయింపు కీలకమే..
కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక ఈసారి మార్చిన సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషించాయి. అక్కడ కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కానుగోలు.. ఇప్పుడు తెలంగాణలోనూ వాటిని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనరల్ సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు టికెట్లు ఇవ్వడం ద్వారా సత్ఫలితాలు సాధించింది. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ కూడా ఇదే తరహాలో పలు జనరల్ సీట్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించి ఏపీలో మంచి ఫలితాలు అందుకున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ ఇదే వ్యూహం అమలు చేయబోతున్నట్లు సమాచారం.
దసరా తర్వాతే అభ్యర్థుల ప్రకటన..
ముఖ్యంగా ఖమ్మంతో పాటు వరంగల్ వంటి రిజర్వుడ్ స్ధానాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వీలైనన్ని చోట్ల ఈ ఫార్ములాను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఫార్ములా తెలంగాణలో ఏ మేరకు వర్కవుట్ అవుతుందనే దానిపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టాలంటే ఇలాంటి భిన్నమైన వ్యూహాల్ని అమలు చేయాల్సిందేనన్న చర్చ కూడా సాగుతోంది. దీంతో దసరా తర్వాతే కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా ప్రకటన ఉండొచ్చని చెబుతున్నారు.