
Huzurabad Campaign: హుజురాబాద్ లో పోటీ వాతావరణం పెరిగింది. పార్టీల్లో ప్రచార హోరు జోరందుకుంది. త్రిముఖ పోరు ఉంటుదని భావించినా కాంగ్రెస్ అంత ప్రభావం చూపలేకపోతున్నందున ద్విముఖ పోరు నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఏర్పడింది. రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడిపోయాయి.
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ మధ్య విమర్శలు ఎక్కువవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల్ని శ్రీనివాస్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు తీసుకొస్తున్నారు. అదే క్రమంలో బీజేపీ కూడా పెద్ద తలకాయలను స్వాగతించేందుకు సిద్ధమైంది. కేంద్రం నుంచి కనీసం డజన్ మంది నేతల్ని ప్రచారం చేసేందుకు రావాల్సిందిగా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. త్వరలోనే వారిని హుజురాబాద్ కు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. టీఆర్ఎస్ బూత్ స్థాయిలో ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేసింది. పోలింగ్ రోజున ఓటర్లందరిని రప్పించేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. పెట్రో, గ్యాస్ ధరలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైతు చట్టాలు తదితర విషయాలపై ఫోకస్ చేసి తద్వారా ఓట్లు సాధించాలని ప్లాన్ వేసుకుంది. దీంతో బీజేపీ కూడా అంతే స్థాయిలో రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విడమరచి చెప్పి కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ లబ్ధి పొందుతున్న విధానంపై వివరించేందుకు జాతీయ నేతల్ని తీసుకొస్తున్నారు.
ఇన్నాళ్లు ఈటల రాజేందర్ కు మద్దతుగా ఇన్ చార్జి జితేందర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మినహా ఎవరు కూడా రాలేదు. అడపాదడపా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం చేసినా పూర్తిస్థాయిలో ఎవరు కూడా పాల్గొనలేదు. దీంతో ప్రస్తుతం కేంద్ర నాయకులను ప్రచారంలో దింపే పనిలో పడిపోయారు. మిగిలిన రోజుల్లో ప్రచారం హోరెత్తేలా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.