Srilanka
Srilanka : ప్రస్తుతం కోతుల జనాభా భారీగా పెరిగిపోతుంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న అవి తగ్గడం లేదు. ఇప్పటికే ఊర్లలో వందల కొద్ది కోతులు హల్ చల్ చేస్తున్నాయి. జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇంట్లో సామాన్లు ఎత్తుకెళ్లడం, ఏమీ అనకపోయినా మీద పడి కొరికేయడం చేస్తున్నాయి. మరి కోతి చేష్టలు అని పెద్దలు మనల్ని ఊరికే అనలేదుగా. ఏ కొంటె పని చేసినా కోతితో పోల్చడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. నిజానికి కోతి చేసే పనులు మనకు చూసేందుకు ముచ్చటగా ఉన్నా.. కొన్ని సార్లు మాత్రం భారీ నష్టం కలుగక మానదు. ఐతే, ఇప్పటి వరకు కోతి వల్ల ఓ ఇంట్లోనో, ఒక ఊరిలోనో సమస్య రావడం సాధారణమైన విషయమే. కానీ ఇదే కోతి కారణంగా ఒక దేశమే నష్టపోయింది.. ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదా.
ఇప్పటివరకు మీరు కోతులు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఇలాంటి అనేక వార్తలను విని ఉంటారు. అది మిమ్మల్ని షాక్‌కు గురిచేసి ఉండవచ్చు. పురాణాల ప్రకారం.. త్రేతా యుగంలో హనుమంతుడు రావణుడి బంగారు లంకకు నిప్పు పెట్టాడు. శ్రీలంకలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అక్కడ ఒక కోతి కారణంగా దేశం మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. శ్రీలంకలోని ఒక విద్యుత్ గ్రిడ్‌లోకి ఒక కోతి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది, దీంతో దేశం మొత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
శ్రీలంక ఎనర్జీ మినిస్టర్ జయకోడి మాట్లాడుతూ.. ఆదివారం (ఫిబ్రవరి 9, 2025) దక్షిణ కొలంబోలో ఒక కోతి గ్రిడ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకిందని, దీనివల్ల వ్యవస్థలో ఇబ్బంది ఏర్పడిందని అన్నారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా మూడు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని ఆయన తెలిపారు. ఉదయం 11:30 గంటలకు దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరించారు..
ఒకే ఒక కోతి గ్రిడ్‌లోకి ప్రవేశించిందన్నారు. ఇంజనీర్లు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. శ్రీలంకలో విద్యుత్తు అంతరాయం ఏర్పడటం ఇదే మొదటిసారి కాదు. 2022 సంవత్సరంలో దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు కూడా శ్రీలంక ప్రజలు నెలల తరబడి విద్యుత్ కోతలను ఎదుర్కోవలసి వచ్చింది. దీని కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి.
2022 సంవత్సరంలో శ్రీలంక ప్రజలు పది పది గంటల పాటు విద్యుత్ కోతలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇది అక్కడి మార్కెట్లపై చాలా భారీ ప్రభావాన్ని చూపింది. ఆ సమయంలో దేశంలో విద్యుత్ కోతలను 13 గంటలకు పొడిగించారు. ఆ సమయంలో శ్రీలంక ఆహారం, ఇంధనం సహా అనేక ముఖ్యమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ఇబ్బంది పడుతోంది.