విశాఖ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు సీఎం జగన్ డిసైడ్ అయిపోయారు. ఈ మేరకు వచ్చే మూడు నెలల్లోనే సీఎం జగన్, మంత్రులు విశాఖకు వచ్చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే విశాఖ కార్పొరేషన్ ఇప్పటికే సీఎం జగన్ , మంత్రులు ఇతర వీఐపీలు సచివాలయానికి రావడానికి ప్రత్యేక రహదారిని నిర్మిస్తుండడం విశేషంగా మారింది.
విశాఖ విమానాశ్రయం నుంచి సచివాలయం వరకు సీఎం, మంత్రులు, వీఐపీల ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రత్యేక రహదారి నిర్మిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రహదారి కోసం ప్రభుత్వం ఏకంగా 100 కోట్లు కేటాయించినట్టు ప్రచారం సాగుతోంది. పనులను యుద్ధ ప్రతిపాదికన చేస్తున్నారు. ఇక జగన్ ముఖ్యమంత్రి నివాసం కోసం బీచ్ రోడ్డులో ఓ ఫంక్షన్ హాలును, ఓ అతిథి గృహాన్ని సైతం ఎంపిక చేసినట్టు సమాచారం.
విమానాశ్రయం నుంచి సచివాలయం వరకు ప్రత్యేక రహదారినిర్మిస్తున్నారు. బోయపాలెం వద్ద ఒక విద్యాసంస్థలో సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిసింది. విమానాశ్రయం నుంచి ఇక్కడి వరకు దాదాపు 35 కి.మీల మార్గాన్ని ఎంపిక చేశారట. ఎన్ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురావాడ మీదుగా ఈ రహదారిని విస్తరిస్తున్నారు. ఈ మార్గంలో అడ్డంకులు ఉన్న చోట ఫ్లై ఓవర్ లు నిర్మించేలా ప్రణాళిక చేపట్టారు.
దీనిపై మంత్రి బోత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు అంతర్గతంగా కీలక సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిసింది. ఇప్పటికే సీఎం భద్రతా సిబ్బంది విమానాశ్రయం టు సచివాలయం మార్గాన్ని పరిశీలించారు. కొన్ని మార్పులు చేయాలని సూచించినట్టు తెలిసింది. ఈ ఏర్పాట్లన్నీ చూస్తే త్వరలోనే విశాఖకు ఏపీ రాజధాని షిఫ్ట్ కావడం ఖాయమని అంటున్నారు.