Telangana Power Projects: కెసిఆర్ చెబుతున్న విద్యుత్ వెలుగుల వెనుక.. అసలు చీకట్లు ఇవి..

విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం వృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ అని భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న ప్రచారం మొత్తం అబద్ధమని తేలిపోయింది. ఇక ఇక్కడే స్థాపిత సామర్థ్యం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : November 22, 2023 4:13 pm

Telangana Power Projects

Follow us on

Telangana Power Projects: “అప్పుడెట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లుంది తెలంగాణ”.. తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పదేపదే భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రచారం ఇది. అన్ని రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని.. విద్యుత్ ఉత్పత్తిలో, విద్యుత్ వాడకంలో దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతోందని భారత రాష్ట్ర సమితి చెప్పుకుంటుంది. కరెంట్ కావాల్నా, కాంగ్రెస్ కావాలా అని కెసిఆర్ పదేపదే అంటున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. నాటి చీకట్లు మళ్ళీ మనం చూడాలా అని హరీష్ రావు భయపెడుతున్నారు. కానీ నిజంగా తెలంగాణ ఆ స్థాయిలో విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని సాధించిందా? గులాబీ పార్టీ చెబుతున్నట్టు విద్యుత్ రంగంలో తిరుగులేని విజయాలను నమోదు చేసిందా? అంటే కాదు అనే సమాధానం వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ వెలువరించిన నివేదిక లో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ వాస్తవం

“తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7770 మెగావాట్ల నుంచి 18 వేల మెగావాట్లకు పెరిగింది. ఇది దేశంలోనే రికార్డు” ఇదీ కేసీఆర్ నుంచి గల్లి లీడర్ వరకు చేసే ప్రచారం. వాస్తవంగా ఇందులో అనేక నిజాలను ప్రభుత్వం దాచిపెట్టింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యుత్ స్థాపిత సామర్థ్యాలపై అక్టోబర్ 2023 నివేదికను ఇటీవల ప్రచురించింది. దీని ప్రకారం తెలంగాణలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం 31 అక్టోబర్ 2023 నాటికి 18,792 మెగా వాట్లు. అంటే జూన్ 2014 నాటికి తెలంగాణ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7770 మెగా వాట్లు.. అంటే తొమ్మిదిన్నర సంవత్సరాల లో తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్థ్యం 141% పెరిగింది. ఇదే నివేదికలో మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ స్థాపిత సామర్థ్యం వివరాలు కూడా ఉన్నాయి.. అక్టోబర్ 31 2023 నాటికి 26,706 మెగావాట్లు. రాష్ట్రం విడిపోయి నాటికి ఏపీ స్థాపిత సామర్థ్యం 8,947 మెగా వాట్లు. అంటే 9 1/2 సంవత్సరాలలో ఏపీ సాధించిన అభివృద్ధి 198%. అంటే ఇది తెలంగాణ వృద్ది రేటు కంటే చాలా ఎక్కువ.

అబద్ధమని తేలింది

విద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యం వృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ అని భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న ప్రచారం మొత్తం అబద్ధమని తేలిపోయింది. ఇక ఇక్కడే స్థాపిత సామర్థ్యం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక రాష్ట్రానికి అనేక మార్గాలలో విద్యుత్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ టీఎస్ జెన్కో, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎన్టిపిసి, ఎన్హెచ్పిసి, ఎన్ పీసీ, ఎన్ఎల్సి లాంటి సంస్థల నుంచి రాష్ట్రానికి వచ్చేవాటా, ప్రైవేటు ప్రాజెక్టుల నుంచి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా (ఇవి కూడా 99% ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉంటాయి) విద్యుత్ వస్తుంది.. మంచి వీటి నుంచి వచ్చే విద్యుత్ కూడా సరిపోకపోతే బహిరంగ మార్కెట్ లో ఎక్స్చేంజెస్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యుత్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 18,792 మెగావాట్ల సామర్థ్యంలో తెలంగాణ ప్రభుత్వం 9 1/2 సంవత్సరాలలో మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం 1780 మెగావాట్లు మాత్రమే. అంటే మొత్తం సామర్థ్యంలో 10 శాతం లోపే. అంటే మిగతా విద్యుత్ మొత్తం ఇతర మార్గాలు, గత ప్రభుత్వాలు సింహభాగం కడితే ఇప్పుడు పూర్తి చేసిన వాటి నుంచి వచ్చింది. ఇక ఈ 1,780 మెగావాట్లలో కూడా 1,080 మెగా వాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ గోదావరి నది ఒడ్డున కట్టడంతో అది చిన్నపాటి వరదలకే మునిగిపోతుంది. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ థర్మల్ పవర్ స్టేషన్ నీడ మునగడం ఖాయం. ఇక నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మొత్తం ఒక విద్యుత్ గ్రిడ్ లాగా మారిపోయింది. దీని ప్రకారం ఒక రాష్ట్రంలో ఎంత స్థాపిత సామర్థ్యం ఉందనే విషయం పెద్ద లెక్కలోకి రాదు. మనదేశంలో ఏ మూల నుంచైనా తక్కువ ధరకు విద్యుత్ కొనే అవకాశం ఉంది. అయితే దురదృష్టవశాత్తూ తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేసిన భద్రాద్రి ప్రాజెక్ట్, భవిష్యత్తులో పూర్తయ్యే 4వేల మెగావాట్ల యాదాద్రి ప్రాజెక్టులు దేశంలోనే అత్యంత ఖరీదైన విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు. ఇదంతా చదివిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మెరుగైనట్టు కనిపిస్తోంది కదూ! మీకు అలాంటి సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ బహిరంగ మార్కెట్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనడం ద్వారా కొరతను అధిగమిస్తున్నది. తెలంగాణలో మాత్రమే కాదు 2015 తర్వాత దేశం మొత్తంలో విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగైంది. దీనికి కారణం గతంలో దేశవ్యాప్తంగా మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడమే.. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ బొగ్గు సరఫరా మెరుగవడం వల్లే దేశంలో 20 కి పైగా రాష్ట్రాలలో ప్రస్తుతానికి విద్యుత్ కోతలు లేవు. మిగతా రాష్ట్రాల్లో కూడా విద్యుత్ కోతలు నామమాత్రంగా ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో విద్యుత్ ను కొనగలిగే ఆర్థిక స్తోమత ఉండే రాష్ట్రాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. తెలంగాణ రాష్ట్రం స్థోమత లేకపోయినప్పటికీ విద్యుత్ సంస్థల ఆస్తులు పూర్తిగా తాకట్టు పెట్టి విద్యుత్ కొంటోంది.. ప్రభుత్వం రాయితీలు పూర్తిగా చెల్లించకపోవడంతో విద్యుత్ సంస్థలు 52 వేల కోట్ల నష్టాలతో ఆర్థికంగా దివాలా అంచున ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఇన్ని వాస్తవాలు కనిపిస్తున్నప్పటికీ వాటిని మరుగున పెట్టి తెలంగాణ వెలిగిపోతోంది అని ప్రకటనలు చేయడం భారత రాష్ట్ర సమితికే చెల్లింది. కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా వెలువరించిన పూర్తి నివేదిక..